Indonesia Open tournament
-
మన కుర్రోడికి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ ట్విటర్ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు తేజం సాత్విక్సాయిరాజ్కి, అలాగే చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. అందరూ గర్వపడేలా గెలుపొందారంటూ ట్వీట్ చేశారాయన. అంతకు ముందు ఒక ప్రకటన ద్వారా.. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్‌ను భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. My congratulations and best wishes to our very own Telugu boy @satwiksairaj and @Shettychirag04! You’ve made us all very proud. pic.twitter.com/VLJxScA29n — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, 2023 ఇదీ చదవండి: ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు -
46 నిమిషాల్లోనే ముగించేసింది..
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ను చైనా షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్‌లో 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత దూకుడును పెంచిన సింధు అటాకింగ్ గేమ్‌తో మొదటి సెట్‌ను 21-19తో కైవసం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇక ఫైనల్లో భాగంగా ఆదివారం జపాన్ స్టార్ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది. ఇక సింధూ ఫైనల్‌కు చేరడంపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఐదో సీడ్ సింధు గోల్డ్ మెడల్ సాధించాలని బాయ్ ఆకాంక్షించింది. Superrrrrr Sindhu!!!🔥 What a performance from the World No 5 @Pvsindhu1, dominated the proceeding to reach the finals of #BlibliIndonesiaOpen2019 defeating World No 3 #ChenYuFei 2⃣1⃣:1⃣9⃣2⃣1⃣:1⃣0⃣. Way to go, Girl! ⚡️ Go for Gold!🥇#IndiaontheRise #badminton pic.twitter.com/FtTZtOLwFq — BAI Media (@BAI_Media) 20 July 2019 -
ఇండోనేసియా ఓపెన్ : సెమీస్‌లోకి సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 21–7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా రెండో సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించిన సింధు మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యంతో 21–7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచిన విషయం తెలిసిందే. ఇక సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది. -
క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం 62 నిమిషాల పాటు సాగిన మహిళల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచింది. మ్యాచ్‌ను డెన్మార్క్ షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధుపై మొదటి గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన సింధు సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించి మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌ను మియా గెలవడంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21–11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గతంలో ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో సింధు ఆమెను మట్టికరిపించింది. పురుషుల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి 15–21, 14–21తో టోర్నీ టాప్ సీడ్ మార్కస్ గిడియోన్ – కెవిన్ సంజయ(ఇండోనేషియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 11–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైయ్యారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు పోటీ పడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచి సమంగా ఉన్నారు. -
సాయిప్రణీత్ ఓటమి
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్ టోర్నీ మ.గం. 1.30 నుంచి సా. గం. 4.15 వరకు స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం జకార్తా: వరుసగా సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరుమీదున్న భారత యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 14–21, 18–21తో రెండో సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. అయితే భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లో విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ 21–15, 17–21, 21–16తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై, ప్రణయ్ 21–13, 21–18తో జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 19–21తో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–19, 19–21, 13–21తో దియాన్ ఫిత్రియాని–నాద్యా మెలాతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)తో ప్రణయ్; జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; నిచావోన్ (థాయ్‌లాండ్)తో సైనా; బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు తలపడతారు. -
సైనా శుభారంభం
తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్‌పై గెలుపు ప్రిక్వార్టర్స్‌లో సింధు ∙ఇండోనేసియా ఓపెన్ టోర్నమెంట్ జకార్తా: తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌ను కష్టపడి దాటింది. ప్రపంచ మాజీ చాంపియన్, ఎనిమిదో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అన్‌సీడెడ్ సైనా 17–21, 21–18, 21–12తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఏడేళ్ల తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లో చోటు కోల్పోయిన సైనా ఈ టోర్నీలో వరుసగా పదో ఏడాది బరిలోకి దిగింది. 2009 నుంచి 2012 వరకు వరుసగా నాలుగేళ్లు ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన సైనా 2011లో రన్నరప్‌గా నిలిచి, మిగతా మూడేళ్లు చాంపియన్‌గా నిలిచింది. అయితే గత నాలుగేళ్లలో సెమీఫైనల్ రౌండ్‌ను దాటలేకపోయిన సైనాకు ఈ ఏడాదీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో ప్రపంచ 11వ ర్యాంకర్ సైనా తలపడుతుంది. నిచావోన్తో ముఖాముఖి రికార్డులో సైనా 7–0తో ఆధిక్యంలో ఉంది. తొలి అడ్డంకిని దాటిన సింధు... మరోవైపు నాలుగో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 33 నిమిషాల్లో 21–12, 21–19తో ప్రపంచ 20వ ర్యాంకర్ పోర్న్‌పవీ (థాయ్‌లాండ్)పై అలవోకగా గెలిచింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు తలపడుతుంది. నాలుగోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడుతోన్న సింధు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. మిగతా రెండుసార్లు ఆమె తొలి రౌండ్లోనే ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 12–21, 9–21తో ఇర్ఫాన్ ఫదిలా–వెని అంగ్రైని (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్ చాంపియన్ మారిన్‌కు షాక్... మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే సంచలనం నమోదైంది. ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అన్‌సీడెడ్ చెన్ జియోజిన్ (చైనా) 64 నిమిషాల్లో 21–12, 10–21, 22–20తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ మారిన్‌ను బోల్తా కొట్టించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మారిన్ 20–18తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. -
సింధుకు సులువైన ‘డ్రా’
ఇండోనేసియా ఓపెన్ టోర్నమెంట్ జకార్తా (ఇండోనేసియా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వచ్చే వారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో సింధుకు నాలుగో సీడింగ్ లభించింది. గతంలో ఈ మెగా టోర్నీలో సింధు మూడుసార్లు ఆడగా... రెండుసార్లు తొలి రౌండ్లో (2014, 2015లో), ఒకసారి రెండో రౌండ్లో (2012లో) నిష్క్రమించింది. ఈసారి తొలి రౌండ్లో పోర్న్‌పవీ (థాయ్‌లాండ్)తో తలపడనున్న సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సున్ యు (చైనా) ఎదురయ్యే అవకాశముంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా ఐదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)లతో సింధు ఆడే చాన్స్ ఉంది. భారత మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో ఆమె ఎనిమిదో సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో ఆడనుంది. -
సెమీస్‌లో శ్రీకాంత్
* సింధుకు చుక్కెదురు * ఇండోనేసియా ఓపెన్ టోర్నీ మలాంగ్: గత ఏడు నెలల్లో తాను పాల్గొన్న 15 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు దానిని అధిగమించాడు. ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-10, 21-5తో 15వ సీడ్ టెక్ జీ సూ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు. కేవలం 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్, ఇండోనేసియా రైజింగ్ స్టార్ జిన్‌టింగ్ ఆంథోనీతో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0-1తో వెనుకబడ్డాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-23, 13-21తో ప్రపంచ 67వ ర్యాంకర్ హీ బింగ్జియావో (చైనా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో గేమ్ పాయింట్‌ను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు కోలుకోలేకపోయింది.