
సింధుకు సులువైన ‘డ్రా’
ఇండోనేసియా ఓపెన్ టోర్నమెంట్
జకార్తా (ఇండోనేసియా): భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వచ్చే వారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈనెల 12 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో సింధుకు నాలుగో సీడింగ్ లభించింది. గతంలో ఈ మెగా టోర్నీలో సింధు మూడుసార్లు ఆడగా... రెండుసార్లు తొలి రౌండ్‌లో (2014, 2015లో), ఒకసారి రెండో రౌండ్‌లో (2012లో) నిష్క్రమించింది.
ఈసారి తొలి రౌండ్‌లో పోర్న్‌పవీ (థాయ్‌లాండ్)తో తలపడనున్న సింధుకు క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సున్ యు (చైనా) ఎదురయ్యే అవకాశముంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) లేదా ఐదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)లతో సింధు ఆడే చాన్స్ ఉంది. భారత మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌లో ఆమె ఎనిమిదో సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో ఆడనుంది.