రచ్చ... రచ్చ...
బీసీసీఐ, లోధా కమిటీ మధ్య ముదిరిన వివాదం
కివీస్‌తో సిరీస్ రద్దు చేస్తామన్న బోర్డు!
మ్యాచ్‌లు ఎలా నిర్వహించాలని ప్రశ్న
అకౌంట్లు స్థంభింపజేసే ఉద్దేశం లేదన్న కమిటీ
లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహరిస్తున్న తీరు ఒక్కసారిగా కొత్త వివాదాన్ని రేపింది. ఒక వైపు సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటూనే... మరో వైపు ’అది తప్ప’ అంటూ తానే బీసీసీఐ మినహాయింపులు తీసేసుకుంటోంది. ఈ ధిక్కార ధోరణిపై ఆగ్రహంతో ఉన్న కమిటీ, కొన్ని లావాదేవీలు నిలిపేయాలంటూ నేరుగా బ్యాంకులకే లేఖ రాయడం బోర్డుకు మంటెత్తించింది. దాంతో మేం అసలు క్రికెటే ఆడలేమంటూ హెచ్చరిస్తే, తాము అకౌంట్లలో తలదూర్చలేదంటూ కమిటీ వివరణ ఇచ్చింది. మొత్తంగా లోధా కమిటీతో నేరుగా తలపడుతూ పరోక్షంగా సుప్రీంనే ఎదిరిస్తున్న బీసీసీఐ ఈ వివాదాన్ని ఎక్కడి వరకు తీసుకెళుతుందో!
ముంబై: బీసీసీఐని ప్రక్షాళన చేయడం కోసం తగిన సూచనలు చేసేందుకు ఏర్పాటైన లోధా కమిటీ ద్వారా... సంస్కరణల సంగతేమో కానీ రోజుకో కొత్త సమస్య ముందుకు వస్తోంది. తాజాగా రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు బదిలీ చేయరాదంటూ కమిటీ కోరడం బోర్డుకు రుచించలేదు. మా అకౌంట్లను ఎలా స్థంభింపజేస్తారని, డబ్బులు లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ ఎలా సాధ్యమని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు ప్రశ్నించారు. అవసరమైతే ప్రస్తుతం జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్‌ను అర్ధాంతరంగా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
బోర్డు అకౌంట్లను స్థంభింపజేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇలాంటి స్థితిలో సిరీస్ రద్దు తప్ప మాకు మరో మార్గం లేదు. ప్రపంచం ముందు మా పరువు పోయేలా ఉంది. ఇప్పుడు మ్యాచ్‌లు ఎలా నిర్వహించాలి? డబ్బులు ఎవరు చెల్లిస్తారు? బ్యాంకు అకౌంట్లను స్థంభింపజేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక అంతర్జాతీయ జట్టు ఇక్కడ ఉందనే విషయం మరచిపోవద్దు’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే లోధా కమిటీ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.
బీసీసీఐ అకౌంట్లను నిలిపివేయాలని తాము చెప్పలేదని, రోజువారీ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగించవచ్చని కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. ’గత నెల 30న జరిగిన ఎస్‌జీఎంలో వివిధ రాష్ట్ర సంఘాలకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆర్థికపరమైన అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందువల్ల కేవలం రెండు అకౌంట్లనుంచి అసోసియేషన్లకు నిధుల పంపిణీ ఆపాలని మాత్రమే చెప్పాం. ఇదేమీ అత్యవసరం కూడా కాదు. మ్యాచ్‌ల నిర్వహణను అడ్డుకోవడం, సిరీస్ రద్దు చేయాలనే అంశాలపై మేమెప్పుడూ సూచనలు చేయలేదు’ అని ఆయన అన్నారు.
బీసీసీఐ వాదన సరైనదేనా: లోధా కమిటీ బీసీసీఐ అకౌంట్ల గురించి అసలు ఏం చెప్పిందో స్పష్టంగా తెలీకుండా, ముందూ వెనకా చూడకుండా సిరీస్ రద్దు చేసేస్తామంటూ బోర్డు అధికారి ఒకరు ప్రకటించేశారు. ఇది ఒక తరహా బ్లాక్‌మెయిలింగే తప్ప వారి వాదనలో అర్థం లేదు. ‘సిరీస్ కొనసాగింపుపై ఇప్పుడే చెప్పలేను. మనం వరల్డ్ నంబర్‌వన్‌గా మారిన సమయంలో ఇలాంటిది దురదృష్టకరం. బీసీసీఐ చాలా బలమైన బోర్డు. డబ్బులు లేకుండా మేం ఆటను నడిపించలేం. మేం ప్రభుత్వంనుంచి డబ్బులు తీసుకోవడం లేదు. బ్యాంకులు నిధులు విడుదల చేయవద్దని చెప్పడం మంచి పరిణామం కాదు’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
అయితే కేవలం రాష్ట్ర సంఘాలకు ఇప్పటికిప్పుడు అదనపు నిధులు ఇవ్వకపోయినంత మాత్రాన వచ్చిన సమస్య ఏమీ లేదు. ఆయా సంఘాలకు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఇవ్వాల్సిన డబ్బులను ఆపేయాలని లోధా కమిటీ చెప్పలేదు. కాబట్టి భారత్, కివీస్ సిరీస్‌కు ఎలాంటి సమస్య లేదు. కానీ బోర్డు మాత్రం లోధా కమిటీనే తప్పు చేసిందని చూపించే ప్రయత్నం చేస్తోంది. బీసీసీఐలో అవసరానికి మించి ఇప్పుడు ఇతరుల జోక్యం పెరిగిందని, ఇదే బోర్డు ద్వారానే క్రికెట్‌లో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
మరో రివ్యూ పిటిషన్..: లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు ఉన్న సమస్యలు ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టులో గత నెల 27న బీసీసీఐ రెండో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆగస్టు 16న ఆ జట్టు వేసిన పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో విచారణకు సుప్రీం స్వీకరించలేదు. కమిటీ సిఫారసుల అమలు విషయంలో తమ వాదనలను పూర్తిగా వినాలని, ఈ విషయంలో జులై 18న ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేయాలని కోరింది. అయితే ఈ నెల 6న లోధా కమిటీ వాదనలు, బీసీసీఐ వివరణల అనంతరం సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.