‘లోధా’ సిఫారసులకు హెచ్‌సీఏ ఓకే!
‘లోధా’ సిఫారసులకు హెచ్‌సీఏ ఓకే!
Published Sun, Nov 20 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ ప్రక్షాళనకు జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర సంఘాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చేరింది. తాము దానిని అమలు చేసేందుకు సిద్ధమని హెచ్‌సీఏ ప్రకటించింది. ఇందుకోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో మొత్తం సభ్యుల ముందు ‘లోధా’ ప్రతిపాదనలు ఉంచి దానికి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్ల డించారు. కొన్నాళ్ల క్రితం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు విచారణ సందర్భంగా తాము లోధా కమిటీ సిఫారసులను అమలు చేస్తామని హైకోర్టుకు హెచ్‌సీఏ విన్నవించింది కూడా. లోధా నివేదికపై విచారణ సందర్భంగా... ప్రతిపాదనలు అమలు చేయడంలో వివిధ రాష్ట్ర సంఘాలకు ఇబ్బందులు ఉన్నాయని బీసీసీఐ సుప్రీం కోర్టుకు వెల్లడించింది.
దాంతో ఈ అంశంపై ఒక్కో సంఘం నుంచి హామీ పొందాలని, అప్పటి వరకు వారికి నిధులు అందజేయరాదని బోర్డును సుప్రీం ఆదేశించింది. దాంతో అన్ని అసోసియేషన్లు తమ అభ్యంతరాలను పక్కన పెడుతూ సిఫారసుల అమలు వైపు మొగ్గుతున్నాయి.
Advertisement