బీసీసీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
లోధా కమిటీ బుధవారం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. బీసీసీఐలో ప్రక్షాళన చేయాలని, పాలనలో మార్పులు తీసుకురావాలని తాము చేసిన సిఫార్సులను బోర్డు విస్మరించిందని కోర్టుకు తెలియజేసింది. బీసీసీఐ చీఫ్ సహా ఇతర అధికారులపై వేటువేయాలని కోరింది. అక‍్టోబర్ 6న ఈ కేసును విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్ చెప్పారు. బీసీసీఐ తమకు తామే చట్టమని భావిస్తున్నట్టుందని, ఇది తప్పని అన్నారు. బీసీసీ ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదని, లోధా కమిటీ సిఫార్సులకు బోర్డు కట్టుబడి ఉండాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత బీసీసీఐని ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు లోధా కమిటీ బోర్డు ప్రక్షాళనకు పలు సిఫార‍్సులు చేసింది.