అవును.. కప్పు తేవాల్సింది నువ్వే
అది ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. నిర్ణీత సమయం అయిపోయింది. రెండు జట్లలో ఏ ఒక్కళ్లూ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయారు. అదనపు సమయం ఇచ్చారు. అవతల అర్జెంటీనా జట్టులో లియోనెల్ మెస్సీ లాంటి స్టార్ ఆటగాడు ఉన్నాడు. అయినా జర్మనీ మాత్రం తన నైతిక ధైర్యాన్ని కోల్పోలేదు. జర్మన్ కోచ్ జాకిమ్ లో నేరుగా తమ జట్టులోని మరియా గోయెట్జ్ వద్దకు వెళ్లాడు. ''ప్రపంచ కప్పును నిర్ణయించాల్సింది నువ్వే. మనకు ఆ కప్పు తేవాల్సింది నువ్వే'' అని చెప్పాడు. కొద్ది నిమిషాలు గడిచాయి.. అంతే, ఒక్కసారిగా దూసుకెళ్లిన గోట్జె టకామని గోల్ సాధించాడు.. జర్మనీ ఫుట్బాల్ ప్రపంచకప్పు గెలుచుకుంది.
''నువ్వు మెస్సీ కంటే గొప్ప ఆటగాడివని ప్రపంచానికి చూపించు. ఈ ప్రపంచ కప్పును నువ్వే నిర్ణయించు'' అంటూ గోయెట్జ్లో ఆత్మస్థైర్యం నింపాడు. ఈ విషయాన్ని కోచ్ లో స్వయంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత విలేకరులకు తెలిపాడు. గోల్ కొట్టగల సామర్థ్యం నీకే ఉందని చెప్పానని, అతడి మీద ఆ నమ్మకం కూడా తనకుందని లో అన్నాడు. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న మొదటి 11 మందిలో గోయెట్జ్ లేడు. తర్వాత మిరొస్లావ్ క్లోసెకు సబ్స్టిట్యూట్గా వెళ్లాడు. ఎక్స్ట్రా టైమ్లో గోల్ కొట్టి, అత్యంత నాటకీయమైన రీతిలో అర్జెంటీనాపై విజయాన్ని, తమ దేశానికి ప్రపంచ కప్పును అందించాడు. తన కుటుంబం, తన స్నేహితురాలు.. అందరూ తనమీద చాలా నమ్మకం పెట్టుకున్నారని, వాళ్లందరికీ కప్పు సాధించి తెస్తానని చెప్పానని, తమ జట్టు సాధించిన ఈ విజయానికి ఎంతో ఆనందంగా ఉందని గోయెట్జ్ చెప్పాడు. ఫైనల్స్లో అతడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.