అంతు పట్టడం లేదా!
భారత్, ఇంగ్లండ్‌లను గందరగోళంలో పడేస్తున్న డీఆర్‌ఎస్
♦ ఇరు జట్ల తప్పుడు నిర్ణయాలు
♦ ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి
ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తొలిసారి భారత్ అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)లో భాగమైంది. కానీ దానిని ఉపయోగించుకోవడంలో శ్రీలంక 11 సార్లు సఫలం కాగా భారత్‌కు అనుకూలంగా ఒకే ఒక్కసారి ఫలితం వచ్చింది! దాంతో దెబ్బకు మళ్లీ ఆ వైపు వెళ్లని టీమిండియా జట్టు... కెప్టెన్, కోచ్ మారాక ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ‘రివ్యూ’కు అంగీకారం తెలిపింది. మరోవైపు ఇంగ్లండ్ చాలా కాలంగా డీఆర్‌ఎస్‌ను వాడుతూ వస్తోంది. అయితే తాజా టెస్టు సిరీస్‌లో ఇరు జట్లూ సమీక్ష కోరడంలో అంచనా తప్పుతున్నాయి. రెండు టీమ్‌లకూ ఇదో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మారిపోయింది. ఇటీవల మారిన డీఆర్‌ఎస్ నిబంధనలు కూడా ఇందుకు ఒక కారణం.
సాక్షి క్రీడా విభాగం
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్, ఇంగ్లండ్ కలిపి 21 సార్లు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశారుు. ఇందులో 12 సార్లు ఇంగ్లండ్ డీఆర్‌ఎస్ వాడగా, మరో 9 సార్లు భారత్ దీనిని ఉపయోగించుకుంది. వీటిలో ఇరు జట్లు మూడేసి సార్లు మాత్రమే తమ అప్పీల్‌కు అనుకూల ఫలితం రాబట్టగలిగాయి. అంటే 15 సార్లు ఆటగాళ్లు విఫల ప్రయత్నం చేసినట్లే లెక్క! సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లో కలిపి మరో 18 సార్లు డీఆర్‌ఎస్ సమీక్ష ముందుకు వచ్చింది. అయితే ఓవరాల్‌గా చూస్తే రెండు టీమ్‌లు కూడా చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే పక్కాగా విశ్వాసంతో రివ్యూను కోరాయి.
చాలా వరకు 50-50 తరహాలోనే కొంత ఆశతో, ఒక రారుు వేసి చూస్తే తప్పేమిటనే తరహాలోనే అప్పీల్ చేశారుు. మరికొన్ని సందర్భాల్లో చివరి వరుస బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ‘రివ్యూ’ మిగిలి ఉంది కాబట్టి నమ్మకం లేకపోయినా రివ్యూను వాడుకున్నారు. చివరకు నాలుగు ఇన్నింగ్‌సలలో కలిపి ఐదు పరుగులు చేసిన ఇంగ్లండ్ బౌలర్ బ్యాటీ కూడా తన ఎల్బీ నిర్ణయంపై సమీక్ష కోరడం చిత్రంగా అనిపిస్తుంది.
మారిన నిబంధనలు...
ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి డీఆర్‌ఎస్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉండగా, బౌలర్లకు ఇది అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ట్రాకింగ్ చేసినప్పుడు గతంలో బంతి సగంకంటే ఎక్కువ భాగం స్టంప్‌ను తాకాలన్నట్లుగా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఆ జోన్ పరిధి తగ్గించడంతో అలా తాకీ తాకకుండా (టచ్ అండ్ గో) వెళుతున్న బంతులకు కూడా బ్యాట్స్‌మన్ అవుట్ కావచ్చు. బహుశా దీనిని అంచనా వేయడంలోనే ఆటగాళ్లు పొరబడుతున్నారు. పైగా ఇలాంటి సందేహాస్పద ఎల్బీడబ్ల్యూ రివ్యూల సమయంలో మొత్తం సమీక్షించిన తర్వాత కూడా ‘అంపైర్స్ కాల్’ అంటూ తుది నిర్ణయం తీసుకునే హక్కు ఫీల్డ్ అంపైర్‌కే ఉంటుంది తప్ప థర్డ్ అంపైర్‌కు కాదు.
అంపైర్లు మరీ బొమ్మల్లా మిగిలిపోకుండా ఈ నిబంధనను చేర్చారు. అరుుతే పాపం... డీఆర్‌ఎస్ కొన్ని సార్లు అంపైర్లను పూర్తిగా తప్పు పడుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. భారత్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మధ్య చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టులో ధర్మసేన ఇచ్చిన 16 నిర్ణయాల్లో ఏకంగా 8 తప్పుగా తేలారుు!
పొరపాట్లు, దిద్దుబాట్లు...
వైజాగ్ టెస్టులో నాలుగో రోజు జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు కుక్ పోరాడుతున్న సమయంలో వికెట్‌ను ఆశిస్తున్న భారత్ ఐదు బంతుల వ్యవధిలో రెండు సార్లు ‘రివ్యూ’ కోరి భంగపడింది. ఈ సందర్భాల్లో బౌలర్లు పట్టుదలగా కనిపించడంతో కోహ్లి వెంటనే రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అదే మొహాలీ టెస్టులో రెండో ఇన్నింగ్‌సలో స్టోక్స్ విషయంలో ఇది బ్రహ్మాండంగా పని చేసింది. రెండో టెస్టులో జయంత్ బౌలింగ్‌లో మొరుున్ అలీ ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడటంతో అంపైర్ నాటౌట్ ఇవ్వగా, ఫీల్డర్లు ముందు అదే నమ్మారు. కానీ కీపర్ సాహా ఒత్తిడితో సమీక్ష కోరగా అది అవుట్‌గా తేలింది.
మరోవైపు ఎంతో అనుభవం ఉన్నా... ఇంగ్లండ్ కూడా ఇలాంటి పొరపాట్లు చాలా చేసింది. రాజ్‌కోట్ టెస్టులో 135 మ్యాచ్‌ల అనుభవం ఉన్న కుక్, తొలి మ్యాచ్ ఆడుతున్న హమీద్‌ను అడిగి రివ్యూకు వెళ్లకుండా నిష్క్రమించాడు. అయితే రీప్లే చూస్తే అతను నాటౌట్ అని తేలింది. ఆ వెంటనే కచ్చితంగా అవుట్‌గా కనిపిస్తున్నా హమీద్ తన కోసం రివ్యూ కోరి దానిని వృథా చేశాడు. వైజాగ్ టెస్టులో సాహా విషయంలో కుక్ సేన రివ్యూను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది.
అంచనా వేయడమెలా...
మ్యాచ్‌లో ఒక్కో రివ్యూ ఎంతో కీలకం కావడంతో దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యం. అంపైర్ నిర్ణయం ప్రకటించిన 15 సెకన్లలోపే రివ్యూను కోరాల్సి ఉంటుంది. అందుకే ఆ హడావిడిలో ఎక్కువగా ఆలోంచించుకోకుండానే కెప్టెన్లు రివ్యూలకు వెళ్లాల్సి రావడం కూడా లెక్క తప్పడానికి కారణమవుతోంది. కాబట్టి బౌలర్, తన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించినప్పుడు వికెట్ కీపర్, క్లోజ్ ఇన్ ఫీల్డర్ సూచనలను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటున్నాడు. అదే బ్యాట్స్‌మన్ అయితే పూర్తిగా నాన్ స్ట్రరుుకర్‌పైనే ఆధారపడుతున్నాడు. ఇది ఎంత ప్రధానాంశంగా మారిందనేదానికి మొహాలీ టెస్టు రెండో ఇన్నింగ్‌సలో జరిగిన ఒక ఘటన సూచిస్తుంది. ఓపెనర్ కుక్ బ్యాటింగ్ చేస్తుండగా నాన్‌స్ట్రయికింగ్‌లో రూట్ ఉన్నాడు.
డీఆర్‌ఎస్ సమస్యను అధిగమించేందుకు రూట్ స్టంప్స్‌కు మరీ దగ్గరగా నిలబడ్డాడు. అక్కడినుంచి అరుుతే బంతి గమనం మరింత స్పష్టంగా కనిపిస్తుందని అతని ఆలోచన. దాంతో బౌలింగ్ చేయడంలో అశ్విన్‌కు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీనిపై స్వల్ప వాదన అనంతరం కల్పించుకున్న అంపైర్లు... బ్యాట్స్‌మెన్ ఎక్కడైనా నిలబడవచ్చని రూట్‌ను సమర్థించారు. డీఆర్‌ఎస్‌పై అంచనా ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. మున్ముందు సిరీస్‌లో ఇరు జట్లు దీనిని మరింత సమర్థంగా ఎలా వాడుకుంటాయనేది ఆసక్తికరం.
మా రివ్యూలు కొన్ని సందర్భాల్లో తప్పుగా తేలాయనే విషయాన్ని అంగీకరిస్తాను. అరుుతే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నామంటే మనం మరో రకంగా ఆలోచిస్తున్నట్లు అర్థం. నా అభిప్రాయాన్ని ఒకసారి పరీక్షించుకునే అవకాశం డీఆర్‌ఎస్ నాకు ఇస్తోంది. కాబట్టి అది సరిగ్గా తేలినా, తప్పయినా నేను అప్పీల్‌కు వెళతాను. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు సరిగ్గా తీసుకునేందుకు ఫీల్డ్ అంపైర్లకే ఎక్కువ అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ‘అంపైర్స్ కాల్’ అంటూ తుది నిర్ణయం వారి చేతుల్లో పెట్టడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా ఇంత తక్కువ సమయంలో మేం దానిని సమర్థంగా ఉపయోగిస్తున్నామా లేదా తేల్చేయడం తప్పు. దానికి కనీసం 12 నెలల సమయం అయినా కావాలి. ఆ తర్వాతే విశ్లేషించి ఒక అభిప్రాయానికి రావచ్చు. -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్