టెస్ట్ క్రికెట్ కు జయవర్ధనే గుడ్ బై!
గాలే: శ్రీలంక ఆటగాడు మహేలా జయవర్ధనే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతకముందు ట్వంటీ20 క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న జయవర్ధనే.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత ఏప్రిల్ లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను శ్రీలంక గెలిచిన అనంతరం ఆ ఫార్మెట్ నుంచి మహేలా తప్పుకున్నాడు. ఇదిలా ఉండగా, తాను వన్డే జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే త్వరలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లతో జరిగే టెస్టు సిరీస్ ల అనంతరం రిటైర్ అవుతానని పేర్కొన్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్ అరవింద డిసిల్వాకు లేఖలో స్పష్టం చేశాడు.
'గత 18 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇది కాస్త కఠిన నిర్ణయమైనా రాజీనామాకు ఇదే సరైన సమయం' అంటూ లేఖలో తెలిపాడు.1997లో భారత్ తో టెస్ట్ కెరీర్ ను ఆరంభించిన జయవర్ధనే.. 11,493 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ అతను ఆడిన 145 టెస్టు కెరీర్ లో 33 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.