ఏ బ్యాట్స్మెన్ అయినా అలా చెప్పగలడా?:ధోని
ఢిల్లీ: న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు పోరాడి ఓడిపోవడం పట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ గేమ్లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే ఓటమికి ప్రధాన కారణమన్నాడు. తమ జట్టులో కొన్ని భాగస్వామ్యాలు నమోదైనా, ఆ భాగస్వామ్యం వచ్చింది అనుకునేలోపే వికెట్లను కోల్పోవడం ఓటమిపై ప్రభావం చూపిందన్నాడు. ఏ బ్యాట్స్మెన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించని ధోని.. తమ ఇన్నింగ్స్ 41.0 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోవడం మ్యాచ్ పై పట్టుకోల్పోయినట్లు తెలిపాడు.
'మ్యాచ్ ను పరిశీలించి చూడండి. పలు కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాం. ఆపై వెంటనే వికెట్లను కోల్పోయాం. ఈ తరహా స్కోరు బోర్డుపై ఉన్నప్పుడు వికెట్లను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా చేస్తే పరుగులు అవే వస్తాయి. వికెట్లు చేతిలో ఉంటే ఓవర్ కు ఆరు, ఏడు పరుగులు సాధించడం అంత కష్టమేమీ కాదు. మా ఓటమికి ప్రధాన కారణం మాత్రం స్వల్ప విరామాల్లో వికెట్లను కోల్పోవడమే. ఇది ఒక్క బ్యాట్స్మెన్ను ఉద్దేశించి చెప్పడం లేదు. మొత్తం జట్టంతా బ్యాటింగ్ లో వైఫల్యం చెందింది. నేను జట్టు గెలుపుకోసం 10 శాతం మించి కృషి చేశానని ఏ ఒక్క బాట్య్మెన్ అయినా చెప్పగలడా?' అని ధోని ప్రశ్నించాడు.