ఒంటి కాలితో అయినా ఆడతానన్నాడు
♦ పాక్‌తో మ్యాచ్‌కు ముందు ధోని పట్టుదల
♦ గుర్తు చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్
చెన్నై: ఆట పట్ల మహేంద్ర సింగ్ ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తాడనేది వాస్తవం. దీనికి మరో ఉదాహరణ గత ఆసియా కప్ సమయంలో జరిగిన ఘటన. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయాన్ని పంచుకున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో ధోని వెన్నుకు తీవ్ర గాయమైంది.
అసలు ఏ మాత్రం నడవలేని స్థితిలో ఉన్న అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆందోళన చెందిన ఎమ్మెస్కే నేరుగా ధోని గదికి వెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ‘ఏం ఫర్వాలేదు ఎమ్మెస్కే భాయ్ అని ధోని నాతో ఒకే ఒక్క మాట అన్నాడు. మీడియాతో ఏం చెప్పాలని అడిగినా అతను మళ్లీ అదే మాట అన్నాడు. ఎందుకైనా మంచిదని నేను పార్థివ్ పటేల్‌ను అందుబాటులో ఉండమని కూడా చెప్పాను.
సరిగ్గా మ్యాచ్‌కు కొద్దిసేపు ముందు ధోని టీమ్ డ్రెస్సుతో సిద్ధమైపోయాడు. నా వద్దకు వచ్చి ఎందుకు అంతగా ఆందోళన పడిపోతున్నావు. ఒక కాలు కోల్పోయినా సరే... పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంటా అని ధోని నాతో చెప్పాడు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ధోని ఎందరికో స్ఫూర్తినిచ్చాడు’ అని ప్రసాద్ మాజీ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించారు.