ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసా..?
ముంబై: టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేస్తున్నాడు? కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ధోనీ నేరుగా ప్రకటించకుండా బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలిపాడు. అతని తరఫున రిటైర్మెంట్ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించింది. ధోనీ ఆటగాడిగా కొనసాగనున్నట్టు ప్రకటించిన బోర్డు.. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్కు అతన్ని ఎంపిక చేసింది. అయితే తన భవిష్యత్ గురించి ప్రణాళికలు ఏంటన్నవి ధోనీ వెల్లడించలేదు. ప్రస్తుతం మహీ ఏం చేస్తున్నాడంటే ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రాణించేందుకు శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో, వీడియోలను ధోనీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కాగా మహీ సొంతూరు రాంచీలో ఉన్నాడా? వేరే చోట ఉన్నాడా? జిమ్‌కు ఎక్కడ వెళ్లాడు వంటి విషయాలను వెల్లడించలేదు.
ఈ నెల 4 ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహీ స్థానంలో విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టెస్టు కెప్టెన్సీ నుంచి ధోనీ ఇంతకుముందే వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లీయే కెప్టెన్. కాగా 35 ఏళ్ల ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో 10న జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు మాత్రం భారత్ ఏ టీమ్‌కు ధోనీనే సారథ్యం వహిస్తాడు.