అభిమానులతో సరదాగా...
మెల్‌బోర్న్: మూడో టెస్టు సన్నాహాల్లో ఉన్న భారత క్రికెటర్లు మంగళవారం ఇక్కడి అభిమానులతో సరదాగా గడిపారు. ఎంసీజీ బయట ‘ఫ్యామిలీ డే’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి జట్టు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ముఖ్యంగా భద్రతాపరమైన కట్టుబాట్లు లేకుండా వారంతా అభిమానులకు బాగా దగ్గరగా రావడం విశేషం. కెప్టెన్ ధోనితో సహా ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలు కూడా దిగారు. అత్యుత్సాహంతో అభిమానులు ‘సెల్ఫీ’ కోసం అడిగినా... భారత ఆటగాళ్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. వీరిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఆటతో సంబంధం లేని అనేక ఆసక్తికర అంశాలపై ఆటగాళ్లు ప్రశాంతంగా, మనసు విప్పి మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాకు మేం ఎప్పుడు వచ్చినా మాకు మంచి మద్దతు లభిస్తుంది. బాగా ఆడితే ఆసీస్ స్థానికులు కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. మూడో టెస్టులోనూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం’ అని కోహ్లి, రోహిత్ ఈ సందర్భంగా చెప్పారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో భారతీయ వంటకాలైన భేల్ పూరి, ఆలూ చాట్, పావ్‌భాజీ, కుల్ఫీవంటివి అమ్మకానికి ఉంచారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంసీజీ నెట్స్‌లో టీమిండియా ప్రాక్టీస్‌ను కూడా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తిలకించారు.