సరదానే సక్సెస్ మంత్రం: ధోని
బెంగళూరు:'మనిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి. అది లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏమీ ఉండదు' ఇది ఫేమస్ డైలాగ్. అయితే జీవితంలో సరదా అనేది ఉండాలంటున్నాడు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ప్రతీ ఒక్కరి జీవితంలో సరదా అనేది ఉంటే సక్సెస్ దానింతటే అదే వస్తుందని ధోని తెలిపాడు. ఈ మేరకు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరనున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టెస్టు జట్టుకు 'సరదా' మంత్రాని ధోని సూచించాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో సరదా అనేది భాగం కావాలని, అప్పుడే విజయాలను అందిపుచ్చుకుంటామని ధోని పేర్కొన్నాడు.
ఆదివారం బెంగళూరులో కొత్త కోచ్ కుంబ్లే, ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ ఎంవీ శ్రీధర్‌లతో పాటు భారత టెస్టు, వన్డే కెప్టెన్లు కోహ్లి, ధోనిలు రోడ్మ్యాప్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లలో సమష్టితత్వం పెంచేందుకు ఓ వైవిధ్యమైన కార్యమ్రాన్ని ఏర్పాటు చేశారు. అటు ధోని, కోహ్లిలతో పాటు, జట్టు సభ్యలు, కోచ్ కుంబ్లే, సహాయ సిబ్బంది గుండ్రంగా కూర్చొని సరదాగా డ్రమ్స్ వాయించారు. ఆటగాళ్లలో ఒత్తిడికి తగ్గించి, వారిలో నూతనోత్తేజాన్ని తగ్గించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. సరదా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నాడు. ఈ రకంగా ఒక వాయిద్యాన్ని వాయించడం చాలా మంది ఆటగాళ్లకు మొదటి అనుభవం కావొచ్చని ధోని తెలిపాడు. విండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు ధోని ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు.