
ముంబై: ప్రస్తుతం పోటీ ఎక్కువైన క్రికెట్లో స్టార్‌గా ఎదగడం కష్టమని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. 1980, 90 దశకంలోని పరిస్థితులు ఇప్పుడు లేవని... నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా క్రికెటర్లు ఎదుగుతున్నారని దీంతో పేరున్న క్రికెటర్ కావడం కష్టమన్నాడు. ‘ఇప్పుడు పిల్లలంతా క్రికెట్‌ను సరదాగా ఆడటం లేదు. ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకొని ఆడుతున్నారు. దీంతో ఇప్పుడు క్రికెట్‌లో చాలా పోటీ నెలకొంది. ఈ పోటీ వాతావరణంలో మేటి క్రికెటర్‌గా ఎదగడం అంత సులభం కాదు. అయితే తమలోని ప్రతిభను నిలకడగా ప్రదర్శించడం ద్వారా క్రికెటర్‌గా ఎదగొచ్చు. పేరున్న లీగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరిస్తేనే జట్టులోకి ఎంపికయ్యే అవకాశముంది.
అప్పుడే అతని క్రికెట్ భవిష్యత్తుకు భరోసాతో పాటు 10–12 ఏళ్లు ఆడే ఆడొచ్చు... డబ్బూ సంపాదించుకోవచ్చు’ అని సెహ్వాగ్ వివరించాడు. ప్రస్తుతం పలు నగరాల నుంచి శివమ్ దూబే (ముంబై), కమలేశ్ నాగర్‌కోటి (రాజస్తాన్), ఇషాన్ పొరెల్ (బెంగాల్), హార్విక్ దేశాయ్ (గుజరాత్), అన్‌మోల్‌ప్రీత్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (పంజాబ్)లు వెలుగులోకి వచ్చారు. అదే 80, 90 దశకాల్లో మాత్రం కేవలం మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల నుంచే ఎక్కువ మంది క్రికెటర్లు వచ్చేవారని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.