
గయానా: పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మాలిక్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1లో అమెజాన్ వారియర్స్.. బార్బోడాస్ ట్రిడెంట్స్‌పై గెలిచి ఫైనల్‌కు చేరింది.
బ్రాండన్ కింగ్(132 నాటౌట్72 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శుభారంభాన్ని ఇవ్వగా, ఆ తర్వాత చంద్రపాల్ మహరాజ్(27) సమయోచితంగా ఆడాడు. ఆపై మాలిక్ 19 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేయడంతో అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇక బార్బోడాస్ 188 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది.
కాగా, నిన్నటి మ్యాచ్ ద్వారా షోయబ్ మాలిక్ తొమ్మిది వేల టీ20 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 9,014 పరుగులతో ఉన్న మాలిక్.. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంతకుముందు తొమ్మిదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న జాబితాలో క్రిస్ గేల్(13,051) అగ్రస్థానంలో ఉండగా మెకల్లమ్(9,922) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్(9,757) పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్ నిలిచాడు.