
ముంబై/కాండీ: మ్యాచ్ ఆడిన తర్వాత కనీసం ఒక రోజు విశ్రాంతి ఉంటే తప్ప ప్రాక్టీస్‌కు కూడా ఆటగాళ్లు హాజరు కాకపోవడం ఐపీఎల్‌లో తరచుగా కనిపిస్తుంది. ఒత్తిడి, ప్రయాణాలు క్రికెటర్లపై అంతటి ప్ర భావం చూపిస్తాయి. అయితే లంక స్టార్ మలింగ మాత్రం అటు తన లీగ్ ఫ్రాంచైజీకి, బోర్డు దేశ వాళీ టోర్నీకి సమన్యాయం చేశాడు! బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ అర్ధరాత్రి దాకా సాగింది. 4 ఓవర్లలో అతను 3 కీలక వికెట్లు తీశాడు.
ఆ తర్వాత రాత్రి 1.40కి బయల్దేరిన అతను గురువారం ఉదయం 4.30కి శ్రీలంక చేరుకొని ఉదయం 7కు వన్డే సూపర్ ఫోర్ ప్రొవిన్షియల్ టోర్నీ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కాండీతో జరిగిన ఈ మ్యాచ్‌లో గాలే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మలింగ... 49 పరుగులకే 7 వికెట్లు తీసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఒక ఆటగాడు వరుసగా రెండు రోజుల్లో రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడటం అరుదైన విషయంగానే చెప్పవచ్చు.