ఇస్లామాబాద్ : ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కీపర్ మాత్రమే కాదు, ‘స్లీప్’ ఫీల్డర్ అంటూ సర్ఫరాజ్ ఆవలింతలపై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అటు పాక్ మాజీ క్రికెటర్లు సైతం తమ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని ప్రస్తుత పాక్ జట్టును నిషేధించాలని గుజరన్‌వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌తో ఘోరపరాజయం నేపథ్యంలో పాక్ జట్టుతో పాటు ఇంజుమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ అభిమాని ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సామా న్యూస్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై స్పందించిన గుజరన్‌వాలా సివిల్ కోర్టు న్యాయమూర్తి పూర్తి వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులకు నోటీసులు జారీ చేశారు.
భారత్ చేతిలో ఘోరాపరాజయం పొందిన నేపథ్యంలో పీసీబీ గవర్నింగ్ బోర్డు బుధవారం సమావేశం కానున్నట్లు జియో న్యూస్ తెలిపింది. ఈ సమావేశంలో జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రపంచకప్‌లో పాక్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ.. టీమ్‌మేనేజ్‌మెంట్‌లోని కోచ్‌లు, సెలక్టర్లతో సహా కొంత మందిని మార్చాలని భావిస్తున్నట్లు లండన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పాక్ జట్టు కోచ్ మిక్కి ఆర్థర్ క్రాంట్రాక్టును సైతం పొడిగించకుండా ఇంటికి పంపించేయోచనలోపీసీబీ ఉన్నట్లు సమాచారం. అలాగే టీమ్ మేనేజర్ తలాత్ అలీ, బౌలింగ్ కోచ్ అజార్ మహమ్ముద్‌లపై వేటు వేయడంతో పాటు సెలక్షన్ కమిటీని మొత్తం రద్దుచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం పాక్‌తో జరిగిన పోరులో భారత్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: కోహ్లినిస్తే.. కశ్మీర్ అడగం : పాక్ అభిమానులు
మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్ ఫైర్
‘సర్ఫరాజ్ స్లీప్ ఫీల్డర్’
Comments
Please login to add a commentAdd a comment