భారత బ్యాడ్మింటన్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన తెలుగు తేజం పీవీ సింధు పేరు మారుమ్రోగిపోతోంది. భారత్‌కు ఒలంపిక్ పతకం సాధించిపెట్టడంతో పాటుగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన ఆమెకు భారతావని నీరాజనాలు పలుకుతోంది. నాలుగు దశాబ్దాల కలగా ఉన్న స్వర్ణాన్ని సాధించిన సింధు ‘మా బంగారం’ అంటూ మురిసిపోతోంది. ఆటలో అసాధారణ ప్రతిభ కనబరిచిన సింధు బ్రాండ్ వ్యాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. స్విట్జర్లాండ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సింధుకు స్వదేశంలో అపూర్వ స్వాగతంతో పాటుగా పలు నజరానాలు లభించాయి. ఆమె గురువు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కూడా ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదంటూ సింధుపై ప్రశంసలు కురిపించారు.
ఇలా దేశమంతా సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన వేళ.. ఆదివారం నాడు స్విట్జర్లాండ్‌లో మరో భారత క్రీడాకారిణి కూడా స్వర్ణం సాధించారు. తన పేరు మానసి జోషి. పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన 30 ఏళ్ల క్రీడాకారిణి ఆమె. తన ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 1 పారుల్ పామర్‌ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నట్లు ఇంకో విషయం ఈ ‘బంగారు’ తల్లి కూడా గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకోవడం విశేషం.
విషాదం నుంచి తేరుకుని చాంపియన్‌గా..
ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలు తెగిపడింది. ఎముకలు విరిగిపోవడంతో పాటు శరీరంలోని పలు కీలక భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన దాదాపు మూడు గంటల పాటు ఘటనాస్థలిలోనే పడి ఉన్నారు. దాదాపు పది గంటల తర్వాత ఆస్పత్రికి చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. అయితే ఆమె కాలు మాత్రం తిరిగి అతికించే అవకాశం లేదని చెప్పారు. గ్యాంగ్రీన్ సోకిన కారణంగా దానిని తొలగించామనే చేదు నిజాన్ని మానసికి చెప్పారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకున్న మానసి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు.
ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడవడం ప్రారంభించిన మానసి బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో ఆట సాధన చేశారు. అదేవిధంగా స్కూబా డైవింగ్‌లో కూడా మెళకువలు నేర్చుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో ఎంపిక కాకపోయినా పట్టుదల వదలక అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇలా తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ.. దృఢ సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోతుందని నిరూపించారు. శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్‌గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2014లో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించిన మానసి ప్రస్తుతం ‘పసిడి’ దక్కించుకుని తానేంటో ప్రపంచానికి చాటిచెప్పారు.
మానసికంగా సన్నద్ధమయ్యా..
తన గెలుపు గురించి మానసి మాట్లాడుతూ...‘ ప్రపంచ చాంపియన్ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఈ విజయం నాకు అలవోకగా దక్కలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి పసిడి కైవసం చేసుకున్నాను. ఎంతో మంది క్రీడాకారులు ఇలాంటి క్షణం కోసం నాలాగే ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కెనడియన్ ఓపెన్‌లో నేను పారుల్(ఇండియా) చేతిలో ఓటమి చవిచూశా. అందుకే ఈ పోటీలకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఫిట్‌నెస్‌తో పాటు ఆట తీరుపై మరింత దృష్టి పెట్టాను. ఎంతో మంది గొప్ప క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించిన ఇదే వేదికపై నేను కూడా నా కలను సాకారం చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు. క్లియర్ స్ట్రోక్స్ సంధిస్తూ కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించాలనే గోపీ సర్ మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ పోటీకి రెండు నెలల ముందు అకాడమీలో జాయిన్ అయిన ఆమె గోపీచంద్‌కు కృతఙ్ఞతలు తెలిపారు.
‘ఇప్పటికైనా ఓ క్రీడాకారిణిగా నా జీవితం మారుతుందనుకుంటున్నా. ఈ పతకం సాధించడం కోసం నేను పడిన కఠోర శ్రమకు తగిన గుర్తింపు, సహాయం లభిస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది జరుగనున్న పారా ఒలంపిక్స్‌పైనే ప్రస్తుతం దృష్టి సారించాను’ అని తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. అదే విధంగా తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న మానసి...‘టోక్యో పారా ఒలంపిక్స్‌కు ఓ ఏడాది ముందుగానే స్వర్ణం సాధించాను. ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్‌లో అద్భుతమైన రోజు అది. పీవీ సింధు నువ్వు చాలా గ్రేట్. శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మానసికి ట్విటర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మానసిపై ప్రశంసలు కురిపించారు. ‘ పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన మానసి జోషికి అభినందనలు. ఈ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన నీకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక మనం కూడా మానసి కోరుకున్నట్లుగా కాస్త ఆలస్యంగానైనా సరే ఆమె విజయానికి తగిన గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.
Many congratulations to #MansiJoshi on winning gold for India 🇮🇳 at the Para-Badminton World Championship 👏👏
— KTR (@KTRTRS) August 28, 2019
Kudos to your spirit & achievement 👍 pic.twitter.com/qGU34X6IBN
Comments
Please login to add a commentAdd a comment