
మానవ్ వికాస్ ఠక్కర్
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇన్నాళ్లూ భారత్ తరఫున ఎవరూ చేరుకోలేని టాప్ ర్యాంక్‌కు యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ చేరుకున్నాడు. అండర్–18 బాలుర సింగిల్స్ విభాగంలో అతను ‘టాప్’ లేపాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఈ గుజరాతీ సంచలనం 6,396 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. గత నెలలోనే రెండో స్థానానికి ఎగబాకిన ఈ 17 ఏళ్ల సూరత్ కుర్రాడు రోజుల వ్యవధిలో అగ్రతాంబూలం అందుకున్నాడు. సాధారణంగా చైనా, జపాన్ ప్లేయర్ల ఆధిపత్యం ఉండే టేబుల్ టెన్నిస్‌లో ఓ భారత ఆటగాడు మొదటి ర్యాంకులో నిలవడం గొప్ప విషయం.
చైనా ప్లేయర్ వాంగ్ చుకిన్ (6,220) రెండో స్థానంలో ఉండగా, భారత సంతతికి చెందిన అమెరికన్ కనక్ జా (6,159) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. హైదరాబాదీ కుర్రాడు సూరావజ్జుల స్నేహిత్ నిలకడగా 24వ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు. అగ్రస్థానంపై స్పందించిన మానవ్ ‘ఇంత త్వరగా నంబర్‌వన్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఎప్పుడైతే టాప్–5లో నిలిచానో అప్పట్నించి నాలో ఆత్మవిశ్వాసం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు టాప్ ర్యాంక్ దక్కింది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment