మానవ్‌జిత్ పసిడి ‘గురి’ | Manavjit Singh Sandhu shoots past Olympic champion to win World | Sakshi
Sakshi News home page

మానవ్‌జిత్ పసిడి ‘గురి’

Published Sun, Apr 13 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

మానవ్‌జిత్ పసిడి ‘గురి’

మానవ్‌జిత్ పసిడి ‘గురి’

 ప్రపంచకప్ ‘ట్రాప్’ షూటింగ్‌లో అగ్రస్థానం  ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌పై గెలుపు
 
 న్యూఢిల్లీ: తనలో ఇంకా చేవ తగ్గలేదని... పట్టుసడలని ఏకాగ్రత... లక్ష్యంపై గురి ఉంటే పతకాలు వాటంతట అవే వస్తాయని భారత స్టార్ ‘ట్రాప్’ షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధూ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) షాట్‌గన్ ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 37 ఏళ్ల ఈ పంజాబ్ షూటర్ ఏకంగా స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.
   

 అమెరికాలోని టక్సన్‌లో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘ట్రాప్’ ఈవెంట్ ఫైనల్లో 2006 వరల్డ్ చాంపియన్ మానవ్‌జిత్ 13-9 పాయింట్లతో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఇద్దరికీ 15 చొప్పున టార్గెట్‌లు ఇచ్చారు. మానవ్‌జిత్ 13 సార్లు లక్ష్యాన్ని ఛేదించగా... 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన మైకేల్ డైమండ్ 9 సార్లు మాత్రమే సఫలమయ్యాడు.


 అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో డైమండ్ 15 పాయింట్లు సాధించగా... మానవ్‌జిత్, అలెక్సీ అలిపోవ్ (రష్యా), ఆరన్ హెడింగ్ (బ్రిటన్) 14 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్‌జిత్ 6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. కాంస్య పతక పోటీలో అలిపోవ్ 12-10తో హెడింగ్‌ను ఓడించాడు. క్వాలిఫయింగ్‌లో మానవ్‌జిత్ 121 పాయింట్లు స్కోరు చేసి సెమీఫైనల్‌కు అర్హత పొందాడు.

 నాలుగేళ్ల విరామం తర్వాత మానవ్‌జిత్ ప్రపంచకప్‌లో పసిడి పతకాన్ని నెగ్గడం విశేషం. చివరిసారి అతను 2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ (2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్) క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మానవ్‌జిత్ మూడుసార్లూ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు.
 
 ఈ మెగా ఈవెంట్ కోసం గత శీతాకాలం మొత్తం సాధన చేశాను. ఫైనల్లో ప్రపంచ మేటి షూటర్లు బరిలోకి దిగారు. ముఖ్యంగా మైకేల్ డైమండ్‌తో ఫైనల్ పోటీ సవాల్‌తో కూడుకున్నది. అయితే మన లక్ష్యాన్ని మనమే గురి చూసి కొట్టాలి కదా. ఫైనల్ స్కోరు ఈ విషయాన్ని చెబుతోంది. ఈ ఏడాది భారత షూటర్లకు ఎంతో కీలకం. జూలైలో కామన్వెల్త్ గేమ్స్, సెప్టెంబరులోనే ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు ఉన్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా 2016 ఒలింపిక్స్‌కు 64 మంది షూటర్లు అర్హత సాధించే అవకాశముంది.
 - మానవ్‌జిత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement