
హాంకాంగ్: మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా ఫ్రీ స్టయిల్ స్విమ్మర్ సున్ యాంగ్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) శుక్రవారం ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబర్‌లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించడానికి వెళ్లిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రతినిధులకు సహకరించకుండా... వారు సేకరించిన శాంపిల్స్‌ను నాశనం చేశాడనే అభియోగంతో సీఏఎస్ అతడిపై విచారణ చేపట్టింది. తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్‌ను దోషిగా తేలుస్తూ... అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అయితే దీనిపై స్పందించిన సున్ తానెటువంటి తప్పు చేయలేదని...దీనిపై స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని మీడియాకు తెలిపాడు. చైనా స్విమ్మింగ్ సంఘం (సీఎస్‌ఏ) కూడా సున్‌కు మద్దతు తెలిపింది. ఆ రోజు సున్ శాంపిల్స్ సేకరించడానికి వచ్చిన వారు అర్హత కలిగిన అధికారులు కాదని తెలిపింది. 2014లో కూడా సున్ డోపింగ్‌లో పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment