
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్ క్రీడాకారుడు నవీన్ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవీన్ విఫలమైనట్లు ఐఏఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్ తన తాజా ప్రకటనలో తెలిపింది. ‘నాడా’ అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ–6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ–6 నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్ 2018 ఫెడరేషన్ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు.