ఒలింపిక్స్ నుంచి రష్యాను గెంటేశారు | Four Years Ban For Russia From Olympic Games | Sakshi
Sakshi News home page

రష్యాను గెంటేశారు

Published Tue, Dec 10 2019 12:59 AM | Last Updated on Tue, Dec 10 2019 9:11 AM

Four Years Ban For Russia From Olympic Games - Sakshi

2016 రియో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో రష్యా బందం (ఫైల్‌)

ప్రపంచ క్రీడల్లో అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలా నిలిచిన దేశం రష్యా. అయితే ‘డోపింగ్‌’ భూతం రష్యా కొంప ముంచింది. ఐదేళ్ల క్రితం ప్రపంచ క్రీడాలోకాన్ని నివ్వెరపరిచిన రష్యాలోని వ్యవస్థీకృత డోపింగ్‌ ఉదంతం కథ ఇప్పుడు కంచికి చేరింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు కనబడకపోవడంతో ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) తీవ్రమైన చర్య తీసుకుంది. ఏకంగా నాలుగేళ్లపాటు అంతర్జాతీయ క్రీడలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ రష్యా దేశంపై ‘వాడా’ నిషేధం విధించింది.

లుసానే (స్విట్జర్లాండ్‌): డోపింగ్‌ భూతం రష్యా పుట్టి ముంచేసింది. అంతర్జాతీయ క్రీడా సమాజం రష్యాను గెంటేసింది. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు దూరం చేసింది. దీంతో టోక్యో వేదికపై రష్యా జాతీయ పతాకం కనిపించదు. జాతీయ గీతం కూడా వినిపించదు. వ్యవస్థీకృత డోపింగ్‌ కారణంగా... ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. సోమవారం జరిగిన ‘వాడా’ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ చర్యతో రష్యా క్రీడా సమాజం తీవ్రంగా నష్టపోనుంది. 2020 పారాలింపిక్స్, 2022 యూత్‌ ఒలింపిక్స్, 2022లో బీజింగ్‌ ఆతిథ్యమివ్వనున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా జట్లేవీ బరిలోకి దిగవు. వచ్చే నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి కూడా పనికిరాదు.

‘వారికి’ అవకాశం
అయితే డోపింగ్‌ మచ్చలేని రష్యా క్రీడాకారులకు ‘వాడా’ కాస్త వెసులుబాటు ఇచ్చింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది. స్వతంత్ర హోదాలో పాల్గొనే రష్యా అథ్లెట్లు పతకాలు గెలిచినా అవి రష్యా ఖాతాలోకి రావు. రష్యా జాతీయ పతాకం ఎగరదు, జాతీయ గీతం కూడా వినిపించదు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే కొన్ని యూరో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు, ఫార్ములావన్‌ రేసు నిర్వహణకు మాత్రం మినహాయింపునిచ్చింది. 2020 యూరో టోర్నీ 12 దేశాల్లో జరగనుంది.

రష్యా  పేరు లేకుండా...
ఒకవేళ ఖతర్‌లో జరిగే 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు రష్యా అర్హత సాధిస్తే పరిస్థితి ఏంటనే దానిపై ‘వాడా’ స్పష్టత ఇవ్వలేదు. యూరోప్‌కు సంబంధించి 2021లో ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రధాన టోర్నీ కానందున క్వాలిఫయింగ్‌లో రష్యా పాల్గొనవచ్చని ‘వాడా’ తెలిపింది. ఒకవేళ రష్యా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా)తో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ‘వాడా’ తెలిపింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆడేందుకు ఒకవేళ రష్యాకు అనుమతి ఇచ్చినా వారు రష్యా పేరును వాడే అవకాశం ఉండదని ‘వాడా’ వివరించింది.

అసలేం జరిగిందంటే... 
రష్యా క్రీడల యంత్రాంగమంతా డోపింగ్‌లో భాగస్వామ్యమైందని జర్మన్‌ టీవీ చానెల్‌ ఓ డాక్యుమెంటరీని ఐదేళ్ల క్రితం 2014 డిసెంబర్‌ లో ప్రసారం చేసింది. ఇది అంతర్జాతీయ క్రీడాలోకాన్నే నిర్ఘాంతపరిచింది. ఎక్కడైనా... ఎప్పుడైనా... డోపింగ్‌లో ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఆటగాళ్లే దొరుకుతారు. మొత్తం దేశమే ఈ అవకతవకల జాడ్యంలో పట్టుపడటం ఏంటనే చర్చ లేవనెత్తింది. దీనిపై దర్యాప్తు చేసిన ‘వాడా’ 2011 నుంచి 2015 వరకు రష్యా వ్యవస్థీకృత డోపింగ్‌కు పాల్పడిందని 2016లో ప్రకటించింది. మాస్కోలోని ల్యాబోరేటరీలోని ఫలితాలన్నీ అసలైనవి కావని, అవన్నీ నకిలీవని విచారణలో తేలింది.

ఆటగాళ్ల రక్త, మూత్ర నమూనాల్లో డోపీలనీ తేలినా... డేటా మొత్తం ఏమార్చిందని విస్తుగొలిపే విషయాన్నీ వెల్లడించింది. మొత్తం అధికార యంత్రాంగం ఈ పాపానికి పాల్పడినట్లు తేలడంతో రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ)పై, రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ)పై వేటు వేసింది. అప్పటినుంచి నిషేధం ఉచ్చు రష్యా మెడకు బిగుసుకుంది. కానీ వ్యక్తిగత క్రీడాంశాలపై కరుణ చూపింది. రష్యా ఆటగాళ్లను  మెగా ఈవెంట్లలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద పాల్గొనేందుకు వెసులుబాటు ఇచ్చింది.

అప్పీలుకు వెళ్లొచ్చు... 
నిషేధంపై అప్పీలుకు వెళ్లేందుకు ‘వాడా’ అవకాశమిచ్చింది. ‘స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు’లో సవాలు చేసేందుకు 21 రోజుల గడువిచ్చింది. ఏదేమైనా రష్యా అథ్లెట్లు మేటి ఈవెంట్లలో పాల్గొనేందుకు వెసులుబాటైతే ఉంది. కానీ... వారిపై ‘వాడా’ ‘స్కానింగ్‌’ తప్పనిసరిగా ఉంటుంది. అంటే ‘వాడా’ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకోలేదని క్షుణ్ణంగా తేలిన అథ్లెట్లను, అది కూడా స్వతంత్రంగా పోటీపడేందుకు అవకాశం కల్పిస్తారు. క్రీడల్లో ఇది అతిపెద్ద డోపింగ్‌ కుంభకోణమని, ఈ అపరాధానికి శిక్షతో పాటు అంతర్జాతీయ సమాజానికి  రష్యా క్షమాపణలు చెప్పాలని నార్వేకు చెందిన న్యాయకోవిదుడు లిండా హెలెలాండ్‌ తెలిపారు. ‘ఈ నిర్ణయంపై నాకు సంతోషం లేదు. కానీ తప్పదు. రష్యా యంత్రాంగం పరీక్షల తాలూకు డేటాను ‘వాడా’ కోరినపుడు ఆలస్యం చేయడంతోనే రష్యా కపటం బట్టబయలైంది’ అని అన్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఐఓసీ సిఫార్సు చేసింది. రష్యా అధికారులు, క్రీడాకారులకు ఈ చర్యలు చెంపపెట్టు కావాలని ఐఓసీ గట్టిగా కోరింది.

కూర్చున్న కొమ్మనే నరుక్కుంది... 
తానెక్కిన కొమ్మను తానే నరికినట్లుగా రష్యా కపటానికి, మోసానికి రష్యానే బలైందని ‘వాడా’ అథ్లెట్‌ ప్యానెల్‌ తెలిపింది. ‘ఈ మొత్తం ఉదంతాన్ని రష్యానే సృష్టించింది. ప్రపంచాన్నే మోసం చేసింది. తద్వారా తమ అథ్లెట్ల బంగారు కలల్ని, ఉజ్వల భవిష్యత్తును రష్యానే నాశనం చేసింది’ అని వాడా ప్యానెల్‌ సమావేశానికి ముందే ప్రకటించింది. రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) మాత్రం ‘వాడా’ చర్యలపై అసంతృప్తి వెళ్లగక్కింది. మొత్తం దేశాన్నే నిషేధించడం సహేతుకం కాదని... ఇది పూర్తిగా అశాస్త్రీయ విధానమని ఆర్‌ఓసీ అభిప్రాయపడింది.

అలా మొదలై... ఇలా వెలియై... 
►డిసెంబర్, 2014:  రష్యా డోపింగ్‌పై జర్మన్‌ టీవీలో డాక్యుమెంటరీ ప్రసారం
►నవంబర్, 2015 రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థపై ‘వాడా’,ఆటగాళ్లపై అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య వేటు.
►జూలై 18, 2016: 2011 నుంచి 2015 వరకు రష్యా వ్యవస్థీకృత డోపింగ్‌కు పాల్పడినట్లు ‘వాడా’ నివేదిక.
►ఆగస్టు, 2016 రియో ఒలింపిక్స్‌లో రష్యా జట్టులో 276 మంది అథ్లెట్లకు అవకాశం. 111 మంది తొలగింపు.
►డిసెంబర్, 2017 ఐఓసీ చర్యలు షురూ. ముందుగా రష్యా ఒలింపిక్‌ కమిటీపై వేటు. 43 మంది అథ్లెట్లపై జీవితకాల నిషేధం. సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా గెలిచిన 13 పతకాలు వాపస్‌.
►ఫిబ్రవరి, 2018 స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో నిషేధాలపై మొదలైన విచారణ. ప్యాంగ్‌చాంగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో 169 మంది రష్యన్లకు ఐఓసీ గ్రీన్‌సిగ్నల్‌.
►సెప్టెంబర్, 2018 మాస్కో ల్యాబోరేటరీ డేటా ఇచ్చేందుకు రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ అంగీకరించడంతో ఆ సంస్థపై నిషేధం ఎత్తివేత.
►జనవరి, 2019 ‘వాడా’కు మాస్కో ల్యాబోరేటరీ డేటా అందజేసిన రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ.
►సెప్టెంబర్, 2019 డేటా అందాకా కొత్తగా మళ్లీ ‘వాడా’ దర్యాప్తు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (దోహా)లో రష్యాపై నిషేధం కొనసాగింపు.
►నవంబర్‌ 25, 2019 నాలుగేళ్ల నిషేధం విధించాలంటూ ‘వాడా’ ప్యానెల్‌ సిఫారసు.
►డిసెంబర్‌ 9, 2019 రష్యాపై నిషేధం ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement