బతుకుబాటలో కష్టాలకు ఎదురు ఈదుతూనే అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువకుడు. 12 ఏళ్ల వయసులో సరదాగా ప్రారంభించిన ఈతలో అసమాన ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. అందరిచేత శభాష్ షేక్ ఖాజా మొహిద్దీన్ అనింపించుకుంటున్నాడు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అది 2003. కాకుమాను మండలం చినలింగాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా షేక్ ఖాజా మొహిద్దీన్ దగ్గరలోని లక్ష్మీపురం బకింగ్‌హామ్ కాలువలో సరదాగా స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ ఈత కొట్టేవాడు. మిగతా వారి కంటే వేగంగా ఈదడం గమనించిన పీఈటీ మనోహర్ మొహిద్దీన్‌ను ప్రోత్సహించారు. నిత్యం సాధన చేస్తే అంతర్జాతీయ స్విమ్మర్‌వి అవుతావని వెన్నుతట్టారు. ఆ మాట మొహిద్దీన్ మదిలో బలంగా నాటుకుపోయింది. అంతే అప్పటి నుంచి ఇంకా అతను ఈతను ఆపలేదు.
కష్టాలను అధిగమించి
ఖాజా స్వస్థలం కాకుమాను మండలం చందోలు. ప్రస్తుతం గుంటూరులోనే స్థిరపడ్డాడు. తండ్రి చిరుద్యోగి. అతి సామాన్య కుటుంబం. నిత్యం ఈత సాధనతో మంచి ప్రావీణ్యం సాధించిన ఖాజా అనేక పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ తరుణంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీదపడడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా వెనుకడుగు వేయలేదు. నిత్య సాధనతో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. విద్యావంతురాలైన భార్య సహకారంతో ముందుకు సాగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు.
ఈత శిక్షకుడిగా మారినా ఆశించిన జీతభత్యాలు లేవు. కరోనా కష్టకాలంలో దాదాపు రెండేళ్లు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూసేశారు. ఈ సమయంలో ఖాజా మంచితనం, స్నేహితుల అండదండలు అతడిని ముందుకు నడిపించాయి. ప్రస్తుతం ఖాజా జీఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దీంతోపాటు గుంటూరులో ప్రముఖులకు శిక్షకుడిగానూ మారారు. ఎందరి నుంచో అభినందనలు పొందారు.
మొహిద్దీన్ సాధించిన విజయాలు
► అంతర్జాతీయంగా : 2018లో ఖజికిస్తాన్‌లో జరిగిన ఇండో– ఖజక్ మాస్టర్స్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు. ఒక రజతం.
► అదే ఏడాది మలేషియాలో జరిగిన ఫస్ట్ ఏషియన్ పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్యం.
► 2019లో టర్కీలో జరిగిన టర్కీ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వింటర్ పోటీల్లో ఐదు రజతాలు, రెండు కాంస్యాలు.
► 2020లో దుబాయ్‌లో జరిగిన 3వ ఇంటర్నేషనల్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు.
► 2022 గత నెల చివరిలో గోవాలో జరిగిన 4 కిలోమీటర్ల సీ స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ స్థానం.
► ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10 బంగారు, ఆరు రజతాలు, ఏడు కాంస్యాలు.
► జాయతీ స్థాయిలో 10 బంగారు, 11 రజతాలు, ఏడు కాంస్యాలతోపాటు రాష్ట్ర స్థాయిలో 50కిపైగా పతకాలు.
చివరి శ్వాస వరకూ..
మా మాస్టారు వల్ల నేను స్విమ్మర్ అయ్యాను. అనూహ్య విజయాలు సాధించాను. దీనికి నా కుటుబంతోపాటు ఎంతోమంది సహాయసహకారాలు కారణం. ఈత కొలను ఎన్నో జీవిత సత్యాలు నేర్పింది. ఈత మధ్యలో ఆపితే ప్రాణం ఎలా ఆగిపోతుందో.. జీవితంలో పోరాటం ఆపినా అది ముగిసిపోతుంది. అందుకే నా చివరి శ్వాస వరకు ఈత కొలనే నా జీవితం. ఇప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఇప్పించి
ఆదుకోవాలని మనవి.
– ఖాజా మొహిద్దీన్, అంతర్జాతీయ స్విమ్మర్
Comments
Please login to add a commentAdd a comment