పుతియాన్(చైనా): భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ ఈవెంట్‌లో మను భాకర్ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో విశేషం. ఇదిలా ఉంచితే, మను భాకర్ స్వర్ణాన్ని సాధించే క్రమంలో నమోదు చేసిన స్కోరుతో జూనియర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. మరొకవైపు ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో హీనా సిద్ధూ తర్వాత పసిడి సాధించిన రెండో భారత షూటర్‌గా మను భాకర్ గుర్తింపు సాధించారు.
ఇక సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్ 241.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించగా, చైనాకు చెందిన క్వియాన్ వాంగ్ 221.8 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత పురుష షూటర్లు అభిషేక్ వర్మ, సౌరవ్ చౌదరిలు ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. అభిషేక్ వర్మ 588 పాయింట్లతో ఫైనల్ బెర్తును సాధించగా, సౌరవ్ 581 పాయింట్లతో తుది పోరుకు సిద్ధమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment