అంగోలాలో 17 మంది ప్రేక్షకులు మృతి
లువాండ: అంగోలాలోని ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందారు. నార్తర్న్ అంగోలాలో ఉజి పట్టణంలోని స్టేడియంలో శాంటారిటా డి కాసియా, రిక్రియటివో డి లిబొలో జట్ల మధ్య జరిగిన దేశవాలీ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ‘స్టేడియంలో మానవ తప్పిదాలవల్లే 17 మంది మృతిచెందారు. 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది’ అని పోలీసులు వెల్లడించారు. అప్పటికే ప్రేక్షకులతో నిండిన ఈ స్టేడియంలోకి వందల మంది ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఫుట్‌బాల్ స్టేడియాలలో ఈ మరణ మృదంగం ఇదే తొలిసారి కాదు. గతంలో జరిగిన ఉదంతాల్లో వందల మంది మరణించారు. 2001లో ఘనాలోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలొదిలారు. అబిద్జాన్‌లో 2009లో ఐవరీకోస్ట్, మలావి జట్ల మధ్య జరిగిన 2010 ప్రపంచకప్ క్వాలిఫయంగ్ మ్యాచ్ సందర్భంగా 19 మంది మృతి చెందారు. 1964లో లిమాలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 320 మంది మృతి చెందారు.