
మరచిపోలేని ఘట్టాలు
ఈడెన్ గార్డెన్స్‌కు 150 ఏళ్లు
ప్రపంచ క్రికెట్‌లో గొప్ప చరిత్ర కలిగిన మైదానాల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. 1864లో స్థాపించిన ఈ స్టేడియానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. శతాబ్దంన్నర కాలంలో ఈ మైదానం ఎన్నో అద్వితీయ ఘట్టాలకు, అపురూప క్షణాలకు, విషాదకర సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అందులో కొన్ని... - సాక్షి క్రీడా విభాగం
ముస్తాక్ లేకపోతే... మ్యాచ్ లేదు...
కోల్‌కతా ప్రేక్షకులకు క్రీడాభిమానం ఎక్కువే. తమకు నచ్చినవారిని అక్కునే చేర్చుకుంటారు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇలాంటి సంఘటనే 1946లో జరిగింది. ఆస్ట్రేలియా సర్వీసెస్ ఎలెవన్ జట్టుతో అనధికారిక టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మన్ ముస్తాక్ అలీకి చోటు లభించలేదు. దాంతో ఆగ్రహించిన ఈడెన్ గార్డెన్స్‌లోని అభిమానులు ‘నో ముస్తాక్... నో టెస్ట్’ అంటూ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. దాంతో సెలక్టర్లు చేసేదేమీలేక ముస్తాక్ అలీని మ్యాచ్ ఆడేందుకు రప్పించారు.
తొక్కిసలాట
కోల్‌కతాలో క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మరీ ముఖ్యంగా కోల్‌కతా ఫుట్‌బాల్ లీగ్ జరుగుతోందంటే అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ లీగ్‌లో హేమాహేమీలైన ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇప్పటికీ మై దానాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. అయితే 1980 ఆగస్టు 16న ఈడెన్ గార్డెన్స్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిశాక జరిగిన తొక్కిసలాటలో 16 మంది అభిమానులు మృతి చెందారు.
హద్దు మీరిన అభిమానం
సొంతగడ్డపై ప్రతిష్టాత్మక 1996 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్. మార్చి 13న జరిగిన ఈ సెమీఫైనల్లో శ్రీలంక జట్టును కట్టడి చేసిన భారత జట్టు నుంచి అభిమానులు విజయాన్ని ఆశించారు. కానీ లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. సచిన్ టెండూల్కర్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. చూస్తుండగానే భారత్ ఓటమి అంచుల్లోకి వెళ్లింది. అంతే అభిమానులు రెచ్చిపోయారు. భారత క్రికెటర్ల పేలవ ప్రదర్శనకు ఆగ్రహించారు. మైదానంలో చెప్పులు, బాటిళ్లు విసిరారు. అభిమానుల వీరంగం తగ్గకపోవడంతో రిఫరీ ఆటను రద్దు చేసి శ్రీలంకను విజేతగా ప్రకటించారు.
వీవీఎస్ స్పెషల్... బజ్జీ భళా...
ఫిక్సింగ్ వివాదంతో భారత క్రికెట్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న దశలో... 2001 మార్చిలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చిరస్మరణీయ ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ‘ఫాలోఆన్’ ఎదుర్కొని ఓటమి బాటలో పయనిస్తున్న భారత జట్టు వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180)ల అద్వితీయ బ్యాటింగ్‌తో నమ్మశక్యంకానీరీతిలో కోలుకుంది. ఆస్ట్రేలియాకు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరిరోజు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (6/73) ‘హ్యాట్రిక్’ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుదేలై ఓటమిని చవిచూసింది.
ఖాళీ స్టేడియంలో మ్యాచ్
1999లో భారత్, పా కిస్థాన్‌ల మధ్య ఆసియా చాంపియన్‌షిప్ టెస్టు మ్యాచ్. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ పేసర్ షోయబ్ అక్తర్ అడ్డు వచ్చినందుకే సచిన్ టెండూల్కర్ రనౌటయ్యాడని భావించిన ప్రేక్షకులు రెచ్చిపోయారు. మైదానంలో బాటిళ్లు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సచిన్, దాల్మియా విజ్ఞప్తి మేరకు ప్రేక్షకులు శాంతించారు. ఆ తర్వాత ప్రేక్షకులందరినీ బయటకు పంపించారు. ఖాళీ స్టేడియంతో మ్యాచ్‌ను కొనసాగించారు. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 232 పరుగులకు ఆలౌటై ఓడింది.
ఈడెన్‌పై స్టాంప్ విడుదల
ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం స్థాపించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం ఈడెన్‌పై పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో క్యాబ్ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కార్, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, విండీస్ పేసర్ మైకేల్ హోల్డింగ్‌లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన మైదానంతో పాటు అత్యుత్తమ క్రికెట్ సెంటర్ ఈడెన్ అని బేడీ కితాబిచ్చారు. ప్రపంచంలో రెండో అత్యుత్తమ మైదానం ఈడెన్ గార్డెన్స్ అని వెంగ్‌సర్కార్ అన్నారు.
భారత్‌కు నంబర్‌వన్ అర్హత ఉంది: గంగూలీ
వరుసగా మూడు సిరీస్‌లు గెలిచిన భారత జట్టుకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకునే అర్హత ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇంగ్లండ్, విండీస్‌లతో పాటు లంకపై సిరీస్ గెలిచింది కాబట్టి ఇది సాధ్యమవుతుందన్నాడు. క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న దాదా, గురువారం జరిగే వన్డేకు వ్యాఖ్యాతగా కూడా పని చేస్తాడు. లంకతో సిరీస్‌ను 4-1 లేదా మెరుగ్గా గెలిస్తే టీమిండియాకు టాప్ ర్యాంక్ దక్కుతుంది.