క్రికెట్‌లో అదొక వేస్ట్‌ రూల్‌.. దాన్ని తీసేయండి! | Mark Waugh Suggests Radical Rule Change In Cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్‌లో అదొక వేస్ట్‌ రూల్‌.. దాన్ని తీసేయండి!

Published Fri, Jan 3 2020 3:15 PM | Last Updated on Fri, Jan 3 2020 3:30 PM

Mark Waugh Suggests Radical Rule Change In Cricket - Sakshi

సిడ్నీ: గడిచిన కొన్నేళ్లలో ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఫార్మాట్‌లను పరిచయం చేయడం దగ్గర్నుంచీ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వరకూ పలు మార్పులు చేసింది ఐసీసీ. అయితే క్రికెట్‌లో లెగ్‌ బైస్‌ నిబంధనను తొలగించాలని అంటున్నాడు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు మార్క్‌ వా. క్రికెట్‌లో అదొక వేస్ట్‌ రూల్‌ అని పేర్కొన్న వా.. దాన్ని మార్చాలంటూ ఐసీసీకి విన్నవించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా గురువారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌ -సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మార్క్‌ వా బ్యాట్స్‌మెన్‌ తీసే లెగ్‌ బైస్‌పై విమర్శలు చేశాడు. ప్రధానంగా సిడ్నీ థండర్స్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ రాస్‌ పదే పదే లెగ్‌ బై రూపంలో పరుగులు సాధించడంతో వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అదే సమయంలో అదొక అనవసరపు రూల్‌ అంటూ పేర్కొన్నాడు. ‘ మనకు తెలుసు.. క్రికెట్‌లో లెగ్‌ బైస్‌ రూల్‌ ఎప్పుడ్నుంచో అమలవుతుంది. ఇది అవసరమా. ఈ రూల్‌ మొత్తం క్రికెట్‌లో లేకుండా మార్చేయండి. నువ్వు బంతిని టచ్‌ చేయలేనప్పుడు పరుగులు ఎందుకు ఇవ్వాలి. శరీరానికి కానీ, ప్యాడ్లకు కానీ బంతి తగిలితే లెగ్‌ బైస్‌గా పరుగులు తీస్తున్నారు. దీనివల్ల క్రికెట్‌లో పారదర్శకత లోపించినట్లే కనబడుతోంది’ అని వా తెలిపాడు. అయితే ఆ కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ మాత్రం వాతో విభేదించాడు. ఇది గేమ్‌లో ఒక భాగమని పేర్కొన్నాడు. కాకపోతే దీనిపై మొండిగా ఉన్నావంటూ మార్క్‌ వాను చమత్కరించాడు.

దీనికి వా సమాధానమిస్తూ.. ఈ పద్ధతిని తాను మారుస్తానంటూ చెప్పుకొచ్చాడు. దానికి మైకేల్‌ వాన్‌ మరోసారి స్పందిస్తూ..‘ నువ్వు క్రికెట్‌ లా మేకర్‌ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలి. నువ్వు అందులో ఉంటే కొత్త విధానాలను తీసుకొస్తావు. అదే సమయంలో లండన్‌ కూడా తరచు రావొచ్చు. లార్డ్స్‌లో ఉన్న ఎంసీసీలోని ఒక చక్కటి రూమ్‌లో కూర్చొని మార్పులు చేయొచ్చు’ అని వాన్‌ పేర్కొనగా, దానికి సమాధానంగా వా మాట్లాడుతూ..‘  ఈ రూల్‌ను మార్చాలనే ఆలోచన మా సోదరుడు స్టీవ్‌ వాది కూడా. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. కనీసం వన్డే క్రికెట్‌లోనైనా తొలగించాలి’ అని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement