'హంతక ముఠాతో క్రికెటర్ కు సంబంధాలు'
ట్రినిడాడ్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ లాసన్ పై వెస్టిండీస్ ఆల్రౌండర్ మార్లొన్ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. తన గురించి లాసన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని శామ్యూల్స్ ఆరోపించాడు. జమైకాలోని హంతకుల ముఠాతో శామ్యూల్స్ కు సంబంధాలు ఉన్నాయని రేడియో కామెంటరీలో లాసన్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోజు అతడీ వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న 'బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్' రేడియో కార్యక్రమంలో లాసన్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ లోని చీకటి వ్యక్తులతో శామ్యూల్స్ కు సంబంధాలున్నాయి. అతడి వెనుక ఎవరున్నారో మీకు తెలియదు. ప్రపంచంలోని హత్యల రాజధానిగా పేరు పొందిన వాటిలో ఒకటైన జమైకాలోని కింగ్ స్టన్ నుంచి అతడు వచ్చాడు. అక్కడి హంత ముఠాలతో అతడికి సంబంధాలున్నాయ'ని అన్నాడు.
లాసన్ వ్యాఖ్యలు తనను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. లాసన్ కామెంట్స్ న్యాయవిరుద్దంగా ఉండడమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. జర్నలిస్ట్ జేమ్స్ మాథహె పేరు కూడా దావాలో చేర్చాడు.