పెర్త్: ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తన స్వీయ తప్పిదంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన కుడి చేతితో గోడకు పంచ్ ఇచ్చి గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు సారథిగా చేస్తున్న మిచెల్ మార్ష్.. పెర్త్‌లో తస్మానియాతో జరిగిన మ్యాచ్ తర్వాత నిరాశకు గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కాగా, ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంతో కలత చెందిన మార్ష్ తన చేతిలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గోడను గట్టిగా కొట్టాడు. అనంతరం గాయంతో విలవిల్లాడిపోయాడు. అతన్ని ఆస‍్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే అతని చేతికి పలు స్కానింగ్‌లు చేసిన తర్వాత మణికట్టు చిట్లినట్లు వైద్యులు తేల్చారు. దాంతో అతను ఫెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ‘ మిచెల్ మార్ష్ చేతికి తీవ్ర గాయమైంది. అతని కుడిచేయి నొప్పి ఇంకా బాధిస్తుంది. ఈ టోర్నీలో మార్ష్ ఆడతాడా..లేదా అంటే వేచిచూడాల్సిందే. మార్ష్ గాయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి’ అని అతని జట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. తరచుగా గాయాల బారిన పడుతూ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోవడంలో ఎక్కువగా విఫలమవుతున్న మార్ష్.. ఇలా తన తప్పిదం కారణంగా గాయం చేసుకోవడమే విడ్డూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment