30 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. పేరుకు వన్డే మ్యాచ్ అయినా కివీస్ ఆటగాళ్ల విజృంభణతో టి20లా సాగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్ల ధాటికి లంక ఆటగాళ్లు పెవిలియన్ కు వరుస కట్టారు. కులశేఖర(19) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెన్రీ 4, మెక్ క్లీనగహన్ 3 వికెట్లు పడగొట్టారు. బ్రాస్ వెల్, సోధి చెరో వికెట్ దక్కించుకున్నారు. 118 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ కేవలం 8.2 ఓవర్లలో చేరుకుంది.
గప్టిల్ సునామీ ఇన్నింగ్స్ తో పది ఓవర్లలోపే కివీస్ లక్ష్యాన్ని చేరుకుంది. లంక బౌలర్లను ఎడాపెడా బాదుతూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 17 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఓవరాల్ గా జయసూర్య, పెరీరాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి ఏబీ డివిలియర్స్ వీళ్ల కంటే ముందున్నాడు.
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పలు ఘనతలు సాధించింది. 16 బంతుల్లో కివీస్ 50 పరుగులు చేసింది. అంతకుముందు 2007లో బంగ్లాదేశ్ పై 21 బంతుల్లో 50 పరుగులు సాధించింది. కివీస్ కు ఇది రెండో బెస్ట్ ఛేజింగ్ రన్ రేట్ 14.16. అంతకుముందు ఇది 15.83గా ఉంది. న్యూజిలాండ్ పై శ్రీలంక 117 కంటే తక్కువ స్కోర్లు రెండుసార్లు నమోదు చేసింది. గతంలో 112, 115 పరుగుల స్వల్పస్కోర్లు సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. గప్టిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.