మార్టిన్ గప్టిల్
ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తెలిపాడు. యాక‌్షన్ థ్రిల్లర్‌ను తలపించిన మెగా ఫైనల్ టై కావడం... అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్ టైటిల్ అందుకోకపోవడంలో గప్టిల్‌ది కాదనలేని పరోక్షపాత్ర. ఆద్యాంతం ఆకట్టుకున్న ఈ ఫైనల్ అనంతరం ఎక్కడా మాట్లాడని గప్టిల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు.
‘లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్ నిలిచింది. కానీ న్యూజిలాండ్ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
టైటిల్ అందకుండా న్యూజిలాండ్‌ను దురదృష్టం గప్టిల్ రూపంలో వెంటాడింది. కివీస్ డెత్ బౌలర్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను భారీ షాట్లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. ఈ సమయంలో గప్టిల్ విసిరిన బంతి నేరుగా బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు ఇచ్చారు. ఇది మ్యాచ్ టై కి దారితీసింది. వాస్తవానికి ఇందులో గప్టిల్, స్టోక్స్ తప్పేం లేదు. ఇక సూపర్ ఓవర్‌లో కూడా మళ్లీ గప్టిల్ రూపంలోనే న్యూజిలాండ్ దురదృష్టం వెంటాడింది. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన సమయంలో గప్టిల్ రనౌట్ కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడం అలా జరిగిపోయింది. ఈ రెండింటిలోను గప్టిల్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికి పరోక్ష పాత్ర కాదనలేనిది. ఇక ఈ మెగాటోర్నీలో గప్టిల్ తనస్థాయి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 186 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment