మేరీ కోమ్... మేరీ కోమ్... మేరీ కోమ్... ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరో స్వర్ణం సొంతం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన మేరీ... తుదిపోరులో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 35 ఏళ్ల వయసులో... ముగ్గురు పిల్లల తల్లి అయినా... తన పంచ్‌లో పదును తగ్గలేదని మరోసారి నిరూపించి... ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా మెరిసింది.
న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ సొంతగడ్డపై జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 48 కేజీల ఫైనల్లో మేరీ కోమ్ 5–0తో హనా ఒఖోటా (ఉక్రెయిన్) పై గెలుపొందింది. బరిలో దిగిన అన్ని బౌట్‌లలో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ మణిపురి మణిపూస తుదిపోరులోనూ అదే రీతిలో చెలరేగి 30–27, 29–28, 29–28, 30–27, 30–27తో ఏకపక్ష విజయం సాధించింది.
ఫైనల్ బౌట్‌లో మేరీ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. తొలి రౌండ్‌లో తన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇక రెండో రౌండ్ ప్రారంభంలోనే బలమైన హుక్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ రౌండ్ పూర్తయ్యేసరికే ఆమె విజయం దాదాపుగా ఖాయమైంది. చివరిదైన మూడో రౌండ్‌లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ... సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చిన మేరీ భావోద్వేగానికి గురై ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ‘చాలా ఆనందంగా ఉంది. మీరు చూపే ఆదరాభిమానాలకు స్వర్ణం తప్ప మరేది నెగ్గకూడ దని అనుకున్నా. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేకపోవడం నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఒలింపిక్స్‌లో ఈ (48 కేజీల) విభాగం లేదు. టోక్యోలో 51 కేజీల విభాగంలో బరిలో దిగుతా’అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ చెప్పింది.
సోనియాకు రజతం...
బరిలో దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే దుమ్మురేపే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యువ బాక్సర్ సోనియా చహల్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. 57 కేజీల ఫైనల్లో సోనియా 1–4తో ఒర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ) చేతిలో ఓడింది. చివరివరకు హోరాహోరీగా పోరాడిన సోనియా 28–29, 28–29, 29–28, 28–29, 28–29తో పరాజయం పాలైంది. ‘నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. అయినా... బాధగా లేదు. రజతం గెలవడం సంతోషాన్నిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతా’అని సోనియా వెల్లడించింది.
ప్రధాని మోదీ, జగన్ అభినందనలు...
ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆమె విజయం ప్రత్యేకమైందని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు.
మరిన్ని విజయాలు సాధించాలి...
సాక్షి, అమరావతి: ఆరో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు అనేకం అందుకోవాలని ఆకాంక్షించారు.
ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు
(5 స్వర్ణాలు, 1 రజతం) సాధించి ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీ తాజా పసిడితో క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ (6 స్వర్ణాలు, 1 రజతం) సరసన నిలిచింది. మేరీ గతంలో 2002, 05, 06, 08, 10లలో స్వర్ణాలు... అరంగేట్ర 2001 చాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఆమె చివరిసారిగా 2010 బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన
మెగా టోర్నీలో విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment