హో చి మిన్ సిటీ (వియత్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో విజయం సాధించి భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన 34 ఏళ్ల మేరీకోమ్ బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై 5-0తో ఏక్షపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌కి ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఆరుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న మేరీకోమ్ ఐదు స్వర్ణాలు సాధించగా, ఓ సారి రజతంతో సరిపెట్టుకుంది.
ఒలింపిక్స్ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్ ఇటీవలే తన పాత వెయిట్ కేటగిరీ 48 కేజీలకు మారిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో సుబాసా కొమురా (జపాన్)పై ఏకపక్ష విజయాన్ని సాధించిన మేరీకోమ్.. నేటి ఫైనల్లోనూ అదేజోరు ప్రదర్శించింది. ఫలితంగా బుధవారం ప్రత్యర్థి కిమ్ హ్యాంగ్ మిని తన పంచులతో ఓ ఆటాడుకున్న మేరీకోమ్ సగర్వంగా ఈ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి స్వర్ణాన్ని ముద్దాడింది.
Comments
Please login to add a commentAdd a comment