
'రియో' అర్హతలో మేరీకోమ్ విఫలం
అస్టానా (కజకిస్తాన్):రియో ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా వరల్డ్ చాంపియన్ షిప్ లో బరిలోకి దిగిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ కు చుక్కెదురైంది. శనివారం జరిగిన రెండో రౌండ్ పోటీలో మేరీకోమ్(51 కేజీల విభాగం) 0-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి అజిజ్ నిమానీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో రియో బెర్తుపై మేరీకోమ్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్ కు చేరితేనే రియో బెర్తు అవకాశం ఉన్న తరుణంలో మేరీకోమ్ రెండో రౌండ్ లో ఇంటిముఖం పట్టడం భారత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.
తొలి రౌండ్ లో మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాల పాటు మేరీకోమ్ తన పంచ్ లతో ఆధిక్యాన్ని కొనసాగించే యత్నం చేసినా, నిమానీ వాటిని చాకచక్యంగా కాపాడుకుంది. ఆ తదుపరి రెండో రౌండ్ లో కూడా మేరీకోమ్ దూకుడును కొనసాగించినా, పంచ్ లను సంధించడంలో వైఫల్యం చెందింది. దీంతో జడ్జిలు నిమానీ 2-0 తో విజయం సాధించినట్లు ప్రకటించారు.