
విశాఖ స్పోర్ట్స్: శ్రీలంక జట్టుకు నిజంగానే ఇది ఊరటనిచ్చే వార్త. సీనియర్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ నిర్ణాయక మూడో వన్డే కోసం ఫిట్‌గా ఉన్నాడు. ఆదివారం అతను బరిలోకి దిగుతాడని లంక టీమ్ మేనేజర్ అసంక గురుసిన్హా తెలిపారు. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో మాథ్యూస్ అజేయ సెంచరీ సాధించాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ శుక్రవారం అతను ప్రాక్టీస్ సెషన్‌లో ఇబ్బంది లేకుండా పాల్గొన్నాడు. ‘మాథ్యూస్ కండరాల నొప్పి నుంచి కోలుకున్నాడు. నెట్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతనే కాదు... మా ఆటగాళ్లందరూ ఫిట్‌గానే ఉన్నారు’ అని గురుసిన్హా అన్నారు.
ప్రాక్టీస్‌కు భారత్ ఆటగాళ్లు దూరం
సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేకు ముందు శ్రీలంక ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. మరోవైపు భారత ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్ చేయలేదు. పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ఆటగాళ్లెవరూ నెట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. శనివారం మాత్రం ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతారని జట్టు వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం భారత ఆటగాళ్లను చూసేందుకు వైజాగ్ వాసులు స్టేడియానికి పోటెత్తారు. అయితే టీమిండియా ఆటగాళ్లెవరూ హోటల్ గదుల నుంచి ప్రాక్టీస్‌కు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో కాసేపు లంక ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తిలకించి నిష్క్రమించారు. ఆల్‌రౌండర్ మాథ్యూస్, కెప్టెన్ పెరీరా నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన చివరి వన్డే ఆదివారం ఉక్కునగరంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment