పాటియాలా: త్వరలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్ ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో మరో యువ స్పిన్నర్ చేరాడు. పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల మయాంక్ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. ఆసీస్‌తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మార్కండేకు జట్టులో చోటు కల్పించారు. తన లెగ్ బ్రేక్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న మయాంక్‌ను ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గొనబోయే భారత జట్టులో చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
పంజాబ్‌కు చెందిన మయాంక్ మార్కండే 2013-14 సీజన్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో 18.24 సగటుతో మొత్తం 29 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్-16 జట్టు తరుపున కేవలం 7 మ్యాచ్‌ల్లోనే మార్కండే ఈ వికెట్లను పడగొట్టడం విశేషం. మరొకవైపు 2015-16 సీజన్‌లో కూచ్ బెహార్ ట్రోఫీలో 25 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచిన మయాంక్ మార్కండే.. 2016-17 సీజన్‌లో 35 వికెట్లు సాధించి మరొకసారి టాప్‌లో నిలిచాడు.
2017-18 సీజన్‌లో పంజాబ్ తరుపున లిస్ట్-ఏ క్రికెట్‌లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడిన మార్కండే మొత్తం 20 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టిన మయాంక్.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు 7 ఫస్టక్లాస్ మ్యాచ్ లాడిన మార్కండే ఇప్పటివరకు 34 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల మార్కును చేరడం మరో విశేషం. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ మొత్తం 14 మ్యాచ్‌లాడి 15 వికెట్లు తీశాడు. ముంబైతో అరంగేట్రం మ్యాచ్‌లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లను మయాంక్ సాధించాడు. ఇందులో అంబటి రాయుడు, ధోని వికెట్లు ఉండటం గమనార్హం. మయాంక్ వేసిన గూగ్లీకి రాయుడు, ధోనిలు ఎల్బీగా పెవిలియన్ చేరారు. . తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో మయాంక్ మార్కండే ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
మార్కండే తన కెరీర్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు. అతన్ని పేసర్‌గా చూడాలన్నది తండ్రి బిక్రమ్ సింగ్ కోరిక. అయితే శిక్షణ కొరకు పాటియాలాలోని ఎన్‌సీఎస్ అకాడమీలో చేరినప్పడు అక్కడ కోచ్ మహేష్ ఇందర్ సింగ్ సూచన మేరకు లెగ్ స్పిన్నర్‌గా మారాడు. లెగ్ స్పిన్‌లో మార్కండే వెపన్ ఏంటంటే గూగ్లీ. గతేడాది ఫిబ్రవరి 7న విజయ్ హాజారే టోర్నీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన మయాంక్ 37 పరుగులిచ్చి రెండు వికెట్లతో సాధించాడు. గత ఏడేళ్లుగా భారత అండర్-19 మాజీ కోచ్ మనీష్ బాలీ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు ఈ యువ కెరటం. తాను లెగ్ స్పిన్నర్‌గా మారడానికి అనిల్ కుంబ్లే, షేన్ వార్న్‌లే కారణమంటున్నాడు మార్కండే.
Comments
Please login to add a commentAdd a comment