ఇక క్రికెట్‌లో ‘రెడ్ కార్డ్’!
బ్యాట్ సైజ్ తగ్గింపు
ఎంసీసీ కీలక సిఫార్సులు
ఆమోదిస్తే అక్టోబర్ నుంచి అమలు
ముంబై: క్రికెట్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యం తేచ్చేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రయత్నిస్తోంది. రెడ్ కార్డ్ సస్పెన్షన్, బ్యాట్ సైజ్ కుదింపులాంటి విప్లవాత్మక మార్పులను క్రికెట్ ‘లా’మేకర్ అయిన ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి సూచించింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశమైన ఈ కమిటీ... పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఈ కమిటీ భేటీలో మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), రమీజ్ రాజా (పాకిస్తాన్), జాన్ స్టీఫెన్సన్ (ఎంసీసీ చీఫ్) పాల్గొన్నారు.
ఈ సిఫార్సులను ఎంసీసీ ప్రధాన కమిటీకి నివేదిస్తారు. అక్కడ అమోదం పొందితే ‘లా ఆఫ్ క్రికెట్’లో కొత్త కోడ్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో మొదలవుతుంది. ఎవరైనా ఆటగాడు మైదానంలో మొరటుగా ప్రవర్తిస్తే ‘రెడ్ కార్డ్’ సస్పెన్షన్ వేటు వేయాలని సిఫారసు చేసిందీ కమిటీ. ఈ తరహా వేటు ప్రస్తుతం ఫుట్‌బాల్, హాకీ తదితర ఆటల్లో అమల్లో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై అడుగులు వేయాలని కమిటీ సూచించింది.
హెల్మెట్‌కు తాకి వచ్చినా...
బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి క్యాచ్ పడితే ప్రస్తుతం నాటౌట్‌గా ఇస్తున్నారు. ఇక నుంచి దానిని అవుట్‌గా పరిగణించాలని సూచించారు. బ్యాట్ సైజ్‌పై పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యాట్‌ను కుదించేందుకు 60 శాతం ఆటగాళ్లు మద్దతిస్తున్నారని అన్నారు. బ్యాట్ బ్లేడ్ సైజ్ 40 మిల్లీమీటర్లు మించకుండా చూడాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తదితర క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో అందరిని సంతృప్తి పరిచాకే తుదినిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.