మా కోసం లీగ్‌లు ... లీగ్‌ల కోసం మేము | me for leags ........lesgs for me | Sakshi
Sakshi News home page

మా కోసం లీగ్‌లు ... లీగ్‌ల కోసం మేము

Published Thu, Dec 31 2015 2:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

మా కోసం లీగ్‌లు ... లీగ్‌ల కోసం మేము - Sakshi

మా కోసం లీగ్‌లు ... లీగ్‌ల కోసం మేము

టి20లకే వెస్టిండీస్  స్టార్లు పరిమితం  
  దుర్భర స్థితిలో  కరీబియన్ జట్టు   
పాపంలో బోర్డుకూ భాగం

ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన తర్వాత వెస్టిండీస్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అవమానకర రీతిలో ఓడింది. ఆ తర్వాత తొలి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయం చవి చూసింది. ఒక్క ఆటగాడు కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో అదే ఆస్ట్రేలియాలో మరో వైపు బిగ్ బాష్ టి20 లీగ్ జరుగుతోంది. అక్కడ ఆడుతున్న విండీస్ ఆటగాళ్లు ‘తమ’ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక వైపు జాతీయ జట్టు పరిస్థితి దారుణంగా ఉండగా, మరో వైపు లీగ్‌లలో మాత్రం స్టార్ క్రికెటర్లు చెలరేగుతుండటం కరీబియన్ జట్టు విషాదం. ప్రపంచవ్యాప్తంగా మేమున్నాం అంటూ అన్ని లీగ్‌లలో ఆడుతున్న ఆటగాళ్లు, జాతీయ జట్టుకు మాత్రం మొహం చాటేస్తున్నారు.
 
 సాక్షి క్రీడా విభాగం
 క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, డారెన్ స్యామీ, కీరన్ పొలార్డ్, ఆండీ రసెల్... ప్రపంచంలో ఎక్కడ టి20 లీగ్ జరిగినా వీరంతా అక్కడ ప్రత్యక్షం. ప్రతీ టి20 జట్టు ఈ ఆటగాళ్లు తమ జట్టులో ఉండాలని కోరుకుంటోంది. అందుకు పెద్ద మొత్తం చెల్లించి మరీ వీరిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా తమ ‘విలువ’కు తగ్గకుండా మంచి ప్రదర్శనే ఇస్తున్నారు. ఐపీఎల్, బిగ్‌బాష్, బంగ్లా లీగ్, పాకిస్తాన్ లీగ్, కరీబియన్ ప్రీమియర్, రామ్‌స్లామ్, నాట్‌వెస్ట్ టి20 బ్లాస్ట్... ప్రపంచంలో ప్రస్తుతం ఏడు దేశాలకు సొంత టి20 లీగ్ టోర్నీలు ఉన్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని ప్రధాన జట్లు విదేశీ ఆటగాళ్లను చేర్చుకొని లీగ్ టి20లను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈ తరహా హిట్టర్లకు గిరాకీ బాగా పెరిగింది. దీనిని ఈ ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు.
 
 గతంలో ఆడలేదా..?
 ‘నేనింకా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. 2016లో ఆడతానేమో. టెస్టులు ఆడేంత ఫిట్‌గా ప్రస్తుతం లేను’... మెల్‌బోర్న్‌లో బిగ్‌బాష్ ఆడుతూ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వ్యాఖ్య ఇది. ప్రపంచం మొత్తం తిరిగి టి20 లీగ్‌లు ఆడేంత ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడు దేశం తరఫున టెస్టులు ఆడలేడా..? పైగా అతనేమీ ఈతరంలో చాలా మందిలాగా టి20లతోనే వెలుగులోకి వచ్చినవాడు కాదు. వందకు పైగా టెస్టులు ఆడిన కొద్ది మంది విండీస్ ఆటగాళ్లలో అతనొకడు. 15 సెంచరీల్లో ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.
 
  కష్టకాలంలో టెస్టు బరిలోకి దిగితే జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగేది.  కానీ అతను ఇష్ట (కష్ట) పడటం లేదు. 40 టెస్టులు ఆడిన డ్వేన్ బ్రేవో కూడా ప్రస్తుత టీమ్‌లో చాలా మందికంటే మెరుగైన ఆటగాడు. 38 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న డారెన్ స్యామీ టెస్టు కెప్టెన్‌గా కూడా పని చేశాడు. పొలార్డ్ టెస్టులు ఎప్పుడూ ఆడకపోయినా...ఈ ఏడాది కూడా ఫస్ట్‌క్లాస్ ఆడిన అతని రికార్డు అక్కడ మెరుగ్గానే ఉంది. ఏకైక టెస్టు ఆడిన రసెల్ ఆల్‌రౌండర్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్ గణాంకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి.
 
 కానీ వీరెవరూ టెస్టులు ఆడేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. వీరిని ఏదోలా ఒప్పించి జట్టు తరఫున ఆడించాలనే ఆలోచన విండీస్ బోర్డుకు లేదు. టి20లతో పోలిస్తే టెస్టు శైలి భిన్నం కావచ్చు. కానీ క్రికెట్ ప్రాధమికాంశాలు తెలిసివారు ఏ ఫార్మాట్‌లో అయినా బాగా ఆడగలరనేది విశ్లేషకుల మాట. చాలా మంది దీనిని నిరూపించారు కూడా.
 
 డబ్బు మాత్రమే  కారణం కాదు
 సాధారణంగా ఏ క్రికెటర్‌ను కదిలించినా జాతీయ జట్టు తరఫున ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని, దేశం తరఫున ఆడటం గర్వకారణంగా భావిస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. టి20ల్లోనూ, లీగ్‌లలో ఎంత మొనగాడైనా తమ జాతీయ జట్టులో అవకాశం లభిస్తుందంటే మిగతావన్నీ పట్టించుకోకుండా సిద్ధమైపోతాడు. కానీ విండీస్ క్రికెటర్లు మాత్రం అలా భావించడం లేదు. రాజకీయాలతో నిండిన విండీస్ బోర్డు తమకు అవకాశం ఇస్తుందా లేదా అనే సందేహాల మధ్య ఉండటంకంటే... తమ శక్తి సామర్థ్యాలను మరో చోట వినియోగించాలని వారు భావిస్తున్నారు. ‘ఈ ఏడాది ఆరంభం వరకు కూడా నేను టెస్టులు ఆడాలని ఆసక్తి కనబర్చాను.
 
  అయితే బోర్డు కానీ సెలక్టర్లు కానీ సీనియర్ ప్లేయర్‌గా మా గురించి ఏం ఆలోచిస్తున్నారో, టెస్టుల్లో నాకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది మాటమాత్రంగానైనా చెప్పలేదు’ అని డ్వేన్ బ్రేవో ఇటీవలే వ్యాఖ్యానించాడు. లీగ్‌లలో వీరంతా తమ డిమాండ్ మేరకు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. అయితే లీగ్‌లలో ఆడుతూ, ఆర్జిస్తూ కూడా తమ దేశం తరఫున ఆడే విధంగా ప్లాన్ చేసుకుంటున్న క్రికెటర్లు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కానీ ఈ కరీబియన్ క్రికెటర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ‘పక్కనే’ ఉండి కూడా ప్రయోజనం పొందలేక విండీస్ జట్టు పరాజయాలతో సతమతమవుతోంది. ‘వీరికి దేశానికి ఆడే విలువ తెలియకపోవడం బాధాకరం. లీగ్‌ల స్థాయిలో ఇక్కడ డబ్బు లేకపోయినా జాతీయ ఆటగాడిగా వారికి మంచి మొత్తమే అందుతుంది. టి 20లు ఆడుతూ కూడా వెస్టిండీస్‌కు ఆడవచ్చనే విషయం వారికి అర్థం కావడం లేదు’ అని దిగ్గజం క్లైవ్ లాయిడ్ అభిప్రాయ పడ్డారు.
 
 విండీస్ బోర్డు మారదా..?
 ప్రపంచం మొత్తం మమ్మల్ని ఆహ్వానిస్తుంటే మా దేశం మాత్రం మమ్మల్మి పట్టించుకోవడం లేదు... అసహనంతో ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్న మాట ఇది. ఒకటా...రెండా వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో ఎన్నో వివాదాలు! పాత జమానానుంచి కూడా అవి ఉన్నా... ఇటీవల అది మరింత పెరిగిపోయింది. ఆటగాళ్లకు న్యాయంగా అందాల్సిన డబ్బులను ఇవ్వకపోవడం మొదలు కఠిన నిబంధనలతో ఆటగాళ్లతోనే ఆడుకుంటూ రాజకీయాలు చేయడంతో పరిస్థితి దిగజారిపోయింది.
 
  గత ఏడాది భారత్‌తో సిరీస్‌ను క్రికెటర్లు బహిష్కరించడంతో ఇది మరింత ముదిరింది. సెలక్షన్‌పై మాట్లాడితే కోచ్‌పై వేటు, జట్టును విమర్శించిన కామెంటేటర్‌తో అసలు మాట్లాడవద్దంటూ నిబంధనలు, ఆటగాళ్ల అభిప్రాయాలను అసలు లెక్కలోకి తీసుకోకపోవడం... ఇవన్నీ విండీస్ బోర్డులో కనిపిస్తున్న రాజకీయాలు. స్వతంత్ర డెరైక్టర్లతో ఇకపై పరిపాలన సాగిస్తామని చెబుతున్నా అది ఏ మాత్రం పనికొస్తుందో చూడాలి.
 
  స్టార్ క్రికెటర్లు వేర్వేరు లీగ్‌లలో ఆడేందుకు అనుమతిస్తూనే... లీగ్‌లు లేని సమయంలోనైనా వెస్టిండీస్ తరఫున ఆడేట్లుగా ప్రణాళిక రూపొందించాలనే ప్రయత్నం కూడా బోర్డు చేయడం లేదు. ఇక ఎన్నో ఏళ్లుగా కలిసి ఒకే జట్టుగా ఆడిన విండీస్ దీవులు ఇకపై సొంతంగా ఆడేందుకే ఆసక్తి చూపిస్తుంచడం కొత్త పరిణామం. గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జమైకా... ఇలా ఒక్కో దీవికి చెందిన ఆటగాళ్లు, అభిమానులు విడిపోవాలని భావిస్తున్నారు. దాంతో బోర్డు భవితవ్యం కూడా సందేహంలో పడింది. ఈ సమస్యలను పరిష్కరించుకోకుంటే వెస్టిండీస్ ఆటగాళ్లు టెస్టులకు దూరంగా టి20 వినోదానికే పరిమితం కావడం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement