Kieran Pollard
-
T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే
Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని జట్లు తమ సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆయా దేశాలు తమ జట్లలో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చవని.. అక్టోబర్ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి విండీస్ జట్టుకు సునీల్ నరైన్ ఎంపిక కాలేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన నరైన్ బౌలింగ్‌లో 4 వికెట్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా కేకేఆర్ తరపున 8 మ్యాచ్‌లాడి 6.12 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో నరైన్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న కరీబియన్ ఫ్యాన్స్ విండీస్ టి20 ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించాలని పెద్ద ఎత్తున కోరారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. అయితే వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ నరైన్ బాగా రాణిస్తున్నప్పటికీ విండీస్ జట్టులో చోటు దక్కడం కష్టమే అని తెలిపాడు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్ మాట్లాడాడు. '' ఐపీఎల్ 2021 జరుగుతున్న యూఏఈ గడ్డపై నరైన్ బాగా రాణిస్తున్నాడు. నరైన్ మొదట నాకు మంచి స్నేహితుడు. ఆ తర్వాత అతనొక వరల్డ్ క్లాస్ క్రికెటర్. అయితే ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌కు జట్టుకు ఎంపికైన 15 మంది ప్రత్యేక శైలి కలిగిన వారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును మార్చి నరైన్‌కు అవకాశం ఇవ్వలేము. అయితే ఎంపిక నా చేతుల్లో ఉండదు. సెలెక్టర్లు నన్ను సంప్రదిస్తే నరైన్ పేరు కచ్చితంగా పేర్కొంటా. కానీ ఆ అవకాశం లేకపోవచ్చు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ సూపర్ 12లో గ్రూఫ్ 1లో ఉంది. విండీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్‌ఫిట్.. జట్టులోకి మరో ఆల్‌రౌండర్! Chris Gayle: ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్ సంచలన వ్యాఖ్యలు -
ఆసీస్ బౌలర్ల దెబ్బ.. చిత్తుగా ఓడిన విండీస్; సిరీస్ కైవసం
బ్రిడ్జ్‌టౌన్: ఆసీస్ బౌలర్ల దెబ్బకు మూడో వన్డేలో వెస్టిండీస్ చిత్తుగా ఓడిపోయి సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి పూర్తి ఓవర్లు కూడా ఆడని విండీస్ 45.1 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఎవిన్ లూయిస్ 55 నాటౌట్‌తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్ల దాటికి ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిచెల్ స్టార్క్ 3, హాజిల్‌వుడ్ 2, అగర్, జంపాలు చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిను ఆసీస్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. లక్ష్య చేధనలో ఆసీస్ ఓపెనర్లు జోష్ ఫిలిప్(10), హెన్రిక్స్(1) వికెట్లను త్వరగానే కోల్పోయినా కెప్టెన్ అలెక్స్ క్యారీ 35, మిచెల్ మార్ష్ 29 పరుగులు చేశారు. ఇక చివర్లో ఆస్టన్ అగర్(19*) తో కలిసి మాథ్యూ వేడ్ 51 పరుగులు నాటౌట్‌గా నిలిచి లాంచనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, వాల్ష్, జోసెఫ్, హెసెన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకోగా.. అంతకముందు జరిగిన టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో విండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
IPL 2021, CSK vs MI: చెన్నైపై పొలార్డ్ పిడుగు
విజయ లక్ష్యం 219 పరుగులు... ప్రత్యర్థి చెన్నై జట్టు అంటే అంత సులువు కాదు. ఒక దశలో 10.2 ఓవర్లలో 138 పరుగులు చేయాలి. కానీ ఈ అసాధ్యాన్ని ఒకే ఒక్కడు సుసాధ్యం చేసి చూపించాడు. వీర విధ్వంసం ప్రదర్శించిన కీరన్ పొలార్డ్ తన మెరుపు బ్యాటింగ్‌తో చివరి వరకు నిలిచి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. అతని బ్యాటింగ్ జోరు ముందు వ్యూహాలు కానరాక చివరకు చెన్నై తలవంచింది. అంతకుముందు అంబటి రాయుడు చూపించిన మెరుపు ప్రదర్శన కూడా పొలార్డ్ జోరు ముందు చిన్నబోయింది. న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ చేయగా... మొయిన్ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్ డు ప్లెసిస్ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. డు ప్లెసిస్‌కు ఐపీఎల్లో ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పొలార్డ్ (34 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చగా, కృనాల్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. శుభారంభం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు డి కాక్, రోహిత్ చకచకా పరుగులు సాధించారు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, డి కాక్ ఒక సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. స్యామ్ కరన్ వేసిన తర్వాతి ఓవర్లో రోహిత్ మళ్లీ రెండు వరుస బౌండరీలు బాదాడు. పవర్‌ప్లేలో ముంబై 58 పరుగులు సాధించింది. అయితే 11 పరుగుల వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్ (3), డి కాక్‌లను అవుట్ చేసి చెన్నై పైచేయి సాధించింది. గెలుపు కోసం 62 బంతుల్లో 138 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై నిలిచింది. పొలార్డ్ విధ్వంసం... గెలుపు బాధ్యతను తీసుకున్న ముంబై బ్యాట్స్‌మన్ పొలార్డ్ తనదైన తరహాలో చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన అతను ఇన్‌గిడి వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. శార్దుల్ ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అతనికి మరో ఎండ్‌లో కృనాల్ నుంచి తగిన సహకారం లభించింది. ఇన్‌గిడి ఓవర్లో కృనాల్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ముంబై గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే స్యామ్ కరన్ చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని (44 బంతుల్లో 89 పరుగులు) విడదీయడంతో సీఎస్కే ఊపిరి పీల్చుకుంది. అయితే చివరి వరకు నిలబడిన పొలార్డ్ జట్టును గెలిపించాడు. డుప్లెసిస్ క్యాచ్ మిస్... చివరి 3 ఓవర్లలో మరింత డ్రామా సాగింది. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో పొలార్డ్ వరుసగా 6, 4 బాదాడు. అయితే పొలార్డ్ వ్యక్తిగత స్కోరు 68 వద్ద లాంగాన్ వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన డు ప్లెసిస్ వదిలేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వచ్చేసేదేమో. 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో కరన్ బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 16; 2 సిక్స్‌లు) భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే కరన్ చక్కటి బంతులతో హార్దిక్‌తో పాటు నీషమ్ (0)ను కూడా అవుట్ చేయడంతో సమీకరణం చివరి ఓవర్లో 16 బంతులకు చేరింది. ఇన్‌గిడి వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి అవకాశం ఉన్నా సింగిల్‌కు నిరాకరించిన పొలార్డ్ తర్వాతి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు. నాలుగో బంతికీ సింగిల్ తీయని అతను ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతిని ఇన్‌గిడి బాగానే వేసినా... లాంగాన్ నుంచి ఫీల్డర్ బంతి విసిరే లోపు కావాల్సిన రెండో పరుగును పొలార్డ్ పూర్తి చేశాడు. సెంచరీ భాగస్వామ్యం... అంతకుముందు చెన్నై ఇన్నింగ్స్ నాలుగో బంతికే రుతురాజ్ (4) అవుట్ కావడంతో తొలి వికెట్ కోల్పోయింది. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న డు ప్లెసిస్, అలీ చెలరేగుతూ ఒకరితో మరికరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించారు. ధావల్ ఓవర్లో ప్లెసిస్ ఫోర్, సిక్స్ కొట్టగా, బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుస బంతుల్లో 6, 4 బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 49 పరుగులకు చేరింది. ఆ తర్వాత రాహుల్ చహర్ ఓవర్లో వీరిద్దరు చెరో సిక్స్ కొట్టారు. నీషమ్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన అలీ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా ఓవర్లో 17 పరుగులు రాబట్టిన ప్లెసిస్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకోవడం విశేషం. అయితే అలీని అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని (61 బంతుల్లో 108 పరుగులు) విడదీయగా... తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ వరుస బంతుల్లో ప్లెసిస్, రైనా (2)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో సరిగ్గా 12 ఓవర్లలో చెన్నై స్కోరు 116 పరుగులు. అయితే రాయుడు విధ్వంసానికి ఆఖరి 8 ఓవర్లలో టీమ్ ఏకంగా 102 పరుగులు సాధించడం విశేషం. బుమ్రా 4–0–56–1 గత మ్యాచ్‌లో సూపర్ స్పెల్‌తో రాజస్తాన్‌ను కట్టడి చేసిన టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో కలిసి రాలేదు. తన ఐపీఎల్లో కెరీర్లోనే అత్యంత చెత్త గణాంకాలను అతను ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. బుమ్రా తొలి ఓవర్లోనే అలీ సిక్స్ బాదడంతో 8 పరుగులు వచ్చాయి. అతని రెండో ఓవర్లో తొలి మూడు బంతులకు ప్లెసిస్ 6, 6, 4 కొట్టాడు (ఓవర్లో మొత్తం పరుగులు 17). తన తర్వాతి ఓవర్లో రాయుడు దెబ్బకు అతను ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా చివరి ఓవర్లో కూడా 10 పరుగులు వచ్చాయి. రాయుడు వీరోచిత ఇన్నింగ్స్... ఈ సీజన్లో ఇప్పటి వరకు రాయుడు ప్రభావం చూపించలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 23, 0, 27, 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ లోటును తీరుస్తూ ఇక్కడ చెలరేగిపోయాడు. పొలార్డ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అనంతరం చహర్ ఓవర్లో స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన భారీ సిక్స్‌తో అతని జోరు మొదలైంది. ధావల్ ఓవర్లోనూ అతను వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. బుమ్రా ఓవర్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇది నోబాల్ కావడంతో వచ్చిన ఫ్రీ హిట్‌ను కూడా రాయుడు బౌండరీకి తరలించాడు. బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో రాయుడు పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ధావల్ వేసిన 20వ ఓవర్ చివరి రెండు బంతులను కూడా రాయుడు 6, 4 గా మలచడం విశేషం. మరోవైపు రవీంద్ర జడేజా (22 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మాత్రం తనదైన దూకుడు కనబర్చలేకపోయాడు. ఈ జంట ఐదో వికెట్‌కు అభేద్యంగా 56 బంతుల్లో 102 పరుగులు జత చేసింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) హార్దిక్ (బి) బౌల్ట్ 4; డు ప్లెసిస్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ 50; అలీ (సి) డి కాక్ (బి) బుమ్రా 58; రైనా (సి) కృనాల్ (బి) పొలార్డ్ 2; రాయుడు (నాటౌట్) 72; జడేజా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 218. వికెట్ల పతనం: 1–4, 2–112, 3–116, 4–116. బౌలింగ్: బౌల్ట్ 4–0–42–1, ధావల్ 4–0–48–0, బుమ్రా 4–0–56–1, రాహుల్ చహర్ 4–0–32–0, నీషమ్ 2–0–26–0, పొలార్డ్ 2–0–12–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి అండ్ బి) అలీ 38; రోహిత్ (సి) రుతురాజ్ (బి) శార్దుల్ 35; సూర్యకుమార్ (సి) ధోని (బి) జడేజా 3; కృనాల్ (ఎల్బీ) (బి) కరన్ 32; పొలార్డ్ (నాటౌట్) 87; హార్దిక్ (సి) డు ప్లెసిస్ (బి) కరన్ 16; నీషమ్ (సి) శార్దుల్ (బి) కరన్ 0; ధావల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–71, 2–77, 3–81, 4–170, 5–202, 6–203. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–37–0, స్యామ్ కరన్ 4–0–34–3, ఇన్‌గిడి 4–0–62–0, శార్దుల్ 4–0–56–1, జడేజా 3–0–29–1, మొయిన్ అలీ 1–0–1–1. -
ఒకే ఓవర్లో 6,6,6,6,6,6
కూలిడ్జ్: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతలో భాగమయ్యాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లోని 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు బాది... గిబ్స్ (దక్షిణాఫ్రికా–2007 వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై వాన్ డాన్ బంజ్ బౌలింగ్‌లో), యువరాజ్ (భారత్– 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పొలార్డ్ దెబ్బకు 36 పరుగులు సమర్పించుకున్న బాధిత బౌలర్ గా స్పిన్నర్ అకిల ధనంజయ నిలిచాడు. పొలార్డ్ సిక్సర్లు కొట్టాడిలా... తొలి బంతి (లెంగ్త్ బాల్): మోకాలిపై కూర్చొ ని స్లాగ్ షాట్. లాంగాన్ మీదుగా సిక్సర్. రెండో బంతి (ఫుల్ బాల్): నేరుగా సైట్ స్క్రీన్ వైపు సిక్సర్. మూడో బంతి (వికెట్‌కు కొంత దూరంగా ఫుల్లర్ బాల్): వైడ్ లాంగాఫ్ దిశగా సిక్సర్. నాలుగో బంతి (లెంగ్త్ బాల్): స్లాగ్ షాట్. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ఐదో బంతి (ఆఫ్ స్టంప్‌పై లెంగ్త్ బాల్): బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్. ఆరో బంతి (రౌండ్ ద వికెట్ ప్యాడ్లపైకి): అలవోకగా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ‘హ్యాట్రిక్’ తర్వాత... పొలార్డ్ బాదుడుకు ముందు వేసిన ఓవర్లో ధనంజయ ఒక్కసారిగా హీరోలా కనిపించగా, తర్వాతి ఓవర్‌కే పరిస్థితి తలకిందులైంది. మ్యాచ్‌లో ముందుగా లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. చూస్తే చిన్న లక్ష్యంగానే కనిపించింది కానీ ధనంజయ వరుస బంతుల్లో లూయిస్ (28), గేల్ (0), పూరన్ (0)లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో మ్యాచ్ లంక వైపు తిరిగింది. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ సాధించిన 13వ బౌలర్‌గా అకిల నిలిచాడు. అయితే చివరకు 13.1 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసిన విండీస్ 4 వికెట్లతో మ్యాచ్ గెలిచింది. -
తొలి టి20 న్యూజిలాండ్‌దే
ఆక్లాండ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో) విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 16 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (37 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఫాబియాన్ అలెన్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రూ ఫ్లెచర్ (14 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లాకీ ఫెర్గూసన్ (5/21) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 176గా నిర్దేశించారు. అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జిమ్మీ నీషమ్ (24 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మిషెల్ సాన్‌ట్నర్ (18 బంతుల్లో 31 నాటౌట్; 3 సిక్సర్లు) చివర్లో విజృంభించడంతో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. -
ప్లేఆఫ్ బెర్త్ ఎవరు ఖరారు చేసుకుంటారో..
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్ ముగింపు దశకు వస్తుండడంతో ప్లేఆఫ్స్‌కు ముందుగా ఏ జట్టు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య అబుదాబి వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. కాగా టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ బరిలోకి దిగకపోవడంతో పొలార్డ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.(చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్) ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా నిలుస్తుంది.ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా.. ఆర్సీబీ మాత్రం మూడు మార్పులు చేసింది. నవదీప్ సైనీ స్థానంలో శివమ్ దూబే, అరోన్ ఫించ్ స్థానంలో జోష్ ఫిలిఫ్, మొయిన్ అలీ స్థానంలో డేల్ స్టెయిన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ వివరించాడు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో ఆర్సీబీ సూపర్ ఓవర్ ద్వారా ముంబైపై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఐపీఎల్లో ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 18, ఆర్సీబీ 10 విజయాలు నమోదు చేశాయి. బెంగళూరు : విరాట్ కోహ్లీ(కెప్టెన్),దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, ఎబి డివిలియర్స్, గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్ ముంబై : ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ఎక్స్పర్ట్ అక్తర్‌ను మించిపోయిన పొలార్డ్
-
మంజ్రేకర్...వాగుడు కట్టిపెట్టు!
పొలార్డ్ ఆగ్రహావేశం ముంబై: ఐపీఎల్లో తన ఆటను విమర్శించిన వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ విరుచుకుపడ్డాడు. మాటలు జాగ్రత్తగా వాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పొలార్డ్ ఔట్ అయిన సందర్భంలో... ఇన్నింగ్స్‌లో చివరి కొన్ని ఓవర్లకు మాత్రమే అతను పనికొస్తాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ పొలార్డ్ ‘నీ నోటి నుంచి సానుకూల మాటలు రావా. డబ్బులు ఇస్తారు కాబట్టి నీ నోటి దూలను కొనసాగించు. బుర్ర లేదని కూడా అన్నావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేం’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. -
మా కోసం లీగ్‌లు ... లీగ్‌ల కోసం మేము
► టి20లకే వెస్టిండీస్ స్టార్లు పరిమితం ► దుర్భర స్థితిలో కరీబియన్ జట్టు ► పాపంలో బోర్డుకూ భాగం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన తర్వాత వెస్టిండీస్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అవమానకర రీతిలో ఓడింది. ఆ తర్వాత తొలి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయం చవి చూసింది. ఒక్క ఆటగాడు కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో అదే ఆస్ట్రేలియాలో మరో వైపు బిగ్ బాష్ టి20 లీగ్ జరుగుతోంది. అక్కడ ఆడుతున్న విండీస్ ఆటగాళ్లు ‘తమ’ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక వైపు జాతీయ జట్టు పరిస్థితి దారుణంగా ఉండగా, మరో వైపు లీగ్‌లలో మాత్రం స్టార్ క్రికెటర్లు చెలరేగుతుండటం కరీబియన్ జట్టు విషాదం. ప్రపంచవ్యాప్తంగా మేమున్నాం అంటూ అన్ని లీగ్‌లలో ఆడుతున్న ఆటగాళ్లు, జాతీయ జట్టుకు మాత్రం మొహం చాటేస్తున్నారు. సాక్షి క్రీడా విభాగం క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, డారెన్ స్యామీ, కీరన్ పొలార్డ్, ఆండీ రసెల్... ప్రపంచంలో ఎక్కడ టి20 లీగ్ జరిగినా వీరంతా అక్కడ ప్రత్యక్షం. ప్రతీ టి20 జట్టు ఈ ఆటగాళ్లు తమ జట్టులో ఉండాలని కోరుకుంటోంది. అందుకు పెద్ద మొత్తం చెల్లించి మరీ వీరిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా తమ ‘విలువ’కు తగ్గకుండా మంచి ప్రదర్శనే ఇస్తున్నారు. ఐపీఎల్, బిగ్‌బాష్, బంగ్లా లీగ్, పాకిస్తాన్ లీగ్, కరీబియన్ ప్రీమియర్, రామ్‌స్లామ్, నాట్‌వెస్ట్ టి20 బ్లాస్ట్... ప్రపంచంలో ప్రస్తుతం ఏడు దేశాలకు సొంత టి20 లీగ్ టోర్నీలు ఉన్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని ప్రధాన జట్లు విదేశీ ఆటగాళ్లను చేర్చుకొని లీగ్ టి20లను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈ తరహా హిట్టర్లకు గిరాకీ బాగా పెరిగింది. దీనిని ఈ ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఆడలేదా..? ‘నేనింకా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. 2016లో ఆడతానేమో. టెస్టులు ఆడేంత ఫిట్‌గా ప్రస్తుతం లేను’... మెల్బోర్న్లో బిగ్‌బాష్ ఆడుతూ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వ్యాఖ్య ఇది. ప్రపంచం మొత్తం తిరిగి టి20 లీగ్‌లు ఆడేంత ఫిట్నెస్ ఉన్న ఆటగాడు దేశం తరఫున టెస్టులు ఆడలేడా..? పైగా అతనేమీ ఈతరంలో చాలా మందిలాగా టి20లతోనే వెలుగులోకి వచ్చినవాడు కాదు. వందకు పైగా టెస్టులు ఆడిన కొద్ది మంది విండీస్ ఆటగాళ్లలో అతనొకడు. 15 సెంచరీల్లో ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. కష్టకాలంలో టెస్టు బరిలోకి దిగితే జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగేది. కానీ అతను ఇష్ట (కష్ట) పడటం లేదు. 40 టెస్టులు ఆడిన డ్వేన్ బ్రేవో కూడా ప్రస్తుత టీమ్‌లో చాలా మందికంటే మెరుగైన ఆటగాడు. 38 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న డారెన్ స్యామీ టెస్టు కెప్టెన్‌గా కూడా పని చేశాడు. పొలార్డ్ టెస్టులు ఎప్పుడూ ఆడకపోయినా...ఈ ఏడాది కూడా ఫస్ట్‌క్లాస్ ఆడిన అతని రికార్డు అక్కడ మెరుగ్గానే ఉంది. ఏకైక టెస్టు ఆడిన రసెల్ ఆల్‌రౌండర్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్ గణాంకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వీరెవరూ టెస్టులు ఆడేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. వీరిని ఏదోలా ఒప్పించి జట్టు తరఫున ఆడించాలనే ఆలోచన విండీస్ బోర్డుకు లేదు. టి20లతో పోలిస్తే టెస్టు శైలి భిన్నం కావచ్చు. కానీ క్రికెట్ ప్రాధమికాంశాలు తెలిసివారు ఏ ఫార్మాట్లో అయినా బాగా ఆడగలరనేది విశ్లేషకుల మాట. చాలా మంది దీనిని నిరూపించారు కూడా. డబ్బు మాత్రమే కారణం కాదు సాధారణంగా ఏ క్రికెటర్‌ను కదిలించినా జాతీయ జట్టు తరఫున ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని, దేశం తరఫున ఆడటం గర్వకారణంగా భావిస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. టి20ల్లోనూ, లీగ్‌లలో ఎంత మొనగాడైనా తమ జాతీయ జట్టులో అవకాశం లభిస్తుందంటే మిగతావన్నీ పట్టించుకోకుండా సిద్ధమైపోతాడు. కానీ విండీస్ క్రికెటర్లు మాత్రం అలా భావించడం లేదు. రాజకీయాలతో నిండిన విండీస్ బోర్డు తమకు అవకాశం ఇస్తుందా లేదా అనే సందేహాల మధ్య ఉండటంకంటే... తమ శక్తి సామర్థ్యాలను మరో చోట వినియోగించాలని వారు భావిస్తున్నారు. ‘ఈ ఏడాది ఆరంభం వరకు కూడా నేను టెస్టులు ఆడాలని ఆసక్తి కనబర్చాను. అయితే బోర్డు కానీ సెలక్టర్లు కానీ సీనియర్ ప్లేయర్‌గా మా గురించి ఏం ఆలోచిస్తున్నారో, టెస్టుల్లో నాకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది మాటమాత్రంగానైనా చెప్పలేదు’ అని డ్వేన్ బ్రేవో ఇటీవలే వ్యాఖ్యానించాడు. లీగ్‌లలో వీరంతా తమ డిమాండ్ మేరకు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. అయితే లీగ్‌లలో ఆడుతూ, ఆర్జిస్తూ కూడా తమ దేశం తరఫున ఆడే విధంగా ప్లాన్ చేసుకుంటున్న క్రికెటర్లు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కానీ ఈ కరీబియన్ క్రికెటర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ‘పక్కనే’ ఉండి కూడా ప్రయోజనం పొందలేక విండీస్ జట్టు పరాజయాలతో సతమతమవుతోంది. ‘వీరికి దేశానికి ఆడే విలువ తెలియకపోవడం బాధాకరం. లీగ్‌ల స్థాయిలో ఇక్కడ డబ్బు లేకపోయినా జాతీయ ఆటగాడిగా వారికి మంచి మొత్తమే అందుతుంది. టి 20లు ఆడుతూ కూడా వెస్టిండీస్‌కు ఆడవచ్చనే విషయం వారికి అర్థం కావడం లేదు’ అని దిగ్గజం క్లైవ్ లాయిడ్ అభిప్రాయ పడ్డారు. విండీస్ బోర్డు మారదా..? ప్రపంచం మొత్తం మమ్మల్ని ఆహ్వానిస్తుంటే మా దేశం మాత్రం మమ్మల్మి పట్టించుకోవడం లేదు... అసహనంతో ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్న మాట ఇది. ఒకటా...రెండా వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో ఎన్నో వివాదాలు! పాత జమానానుంచి కూడా అవి ఉన్నా... ఇటీవల అది మరింత పెరిగిపోయింది. ఆటగాళ్లకు న్యాయంగా అందాల్సిన డబ్బులను ఇవ్వకపోవడం మొదలు కఠిన నిబంధనలతో ఆటగాళ్లతోనే ఆడుకుంటూ రాజకీయాలు చేయడంతో పరిస్థితి దిగజారిపోయింది. గత ఏడాది భారత్‌తో సిరీస్‌ను క్రికెటర్లు బహిష్కరించడంతో ఇది మరింత ముదిరింది. సెలక్షన్‌పై మాట్లాడితే కోచ్‌పై వేటు, జట్టును విమర్శించిన కామెంటేటర్‌తో అసలు మాట్లాడవద్దంటూ నిబంధనలు, ఆటగాళ్ల అభిప్రాయాలను అసలు లెక్కలోకి తీసుకోకపోవడం... ఇవన్నీ విండీస్ బోర్డులో కనిపిస్తున్న రాజకీయాలు. స్వతంత్ర డెరైక్టర్లతో ఇకపై పరిపాలన సాగిస్తామని చెబుతున్నా అది ఏ మాత్రం పనికొస్తుందో చూడాలి. స్టార్ క్రికెటర్లు వేర్వేరు లీగ్‌లలో ఆడేందుకు అనుమతిస్తూనే... లీగ్‌లు లేని సమయంలోనైనా వెస్టిండీస్ తరఫున ఆడేట్లుగా ప్రణాళిక రూపొందించాలనే ప్రయత్నం కూడా బోర్డు చేయడం లేదు. ఇక ఎన్నో ఏళ్లుగా కలిసి ఒకే జట్టుగా ఆడిన విండీస్ దీవులు ఇకపై సొంతంగా ఆడేందుకే ఆసక్తి చూపిస్తుంచడం కొత్త పరిణామం. గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జమైకా... ఇలా ఒక్కో దీవికి చెందిన ఆటగాళ్లు, అభిమానులు విడిపోవాలని భావిస్తున్నారు. దాంతో బోర్డు భవితవ్యం కూడా సందేహంలో పడింది. ఈ సమస్యలను పరిష్కరించుకోకుంటే వెస్టిండీస్ ఆటగాళ్లు టెస్టులకు దూరంగా టి20 వినోదానికే పరిమితం కావడం ఖాయం.