నిరీక్షణ ముగించాలని! | medal target in world championship | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ముగించాలని!

Published Tue, Jun 27 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

నిరీక్షణ ముగించాలని!

నిరీక్షణ ముగించాలని!

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకమే లక్ష్యంగా ఆడతా
ఈ విజయాలను ఆస్వాదిస్తున్నాను   ∙
భారత స్టార్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ వ్యాఖ్యలు


గత నాలుగు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లలో భారత క్రీడాకారిణులు పతకంతో తిరిగి వచ్చారు. 2011లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప ద్వయం కాంస్యం... 2013, 2014లలో పీవీ సింధు కాంస్యం... 2015లో సైనా నెహ్వాల్‌ రజత పతకం సాధించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. 1983లో ప్రకాశ్‌ పదుకొనె కాంస్య పతకం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మరో పతకం రాలేదు.

అంతా అనుకున్నట్లు జరిగితే... 34 ఏళ్ల నిరీక్షణకు ఈసారి తెర పడే అవకాశాలున్నాయి. వరుసగా మూడు సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా వాటిలో రెండు టైటిల్స్‌ కూడా నెగ్గిన కిడాంబి శ్రీకాంత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... స్కాట్లాండ్‌లో ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచేందుకే ఆడతానని శ్రీకాంత్‌ కూడా స్పష్టం చేయడంతో మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ముగిసేలా కనిపిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: వారం వ్యవధిలో రెండు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ మున్ముందూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానని తెలిపాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచి నగరానికి చేరుకున్న శ్రీకాంత్‌తోపాటు అతని సహచరులు సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లను జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఘనంగా సత్కరించారు.

గచ్చిబౌలిలోని గోపీచంద్‌ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐడీబీఐ ఫెడరల్‌ కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కార్తీక్‌ రామన్‌ నగదు పురస్కారాలు అందజేశారు. రెండు టైటిల్స్‌ నెగ్గిన శ్రీకాంత్‌కు రూ. 6 లక్షలు... ఇండోనేసియా ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), ప్రపంచ, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)లను ఓడించి సెమీస్‌ చేరుకున్న ప్రణయ్‌కు రూ. 2 లక్షల నగదు పురస్కారం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై శ్రీకాంత్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...

విజయం కోసమే...
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌–10లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే టాప్‌–10లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్‌లలో ఆడలేదు. ఈ టోర్నీలలో విజయం సాధించేందుకే బరిలోకి దిగాను. ఆగస్టులో స్కాట్లాండ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ తప్పకుండా పతకం గెలిచేందుకే ఆడతాను. ప్రస్తుతం నా ఆలోచనంతా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గురించే. ర్యాం క్‌ల గురించి అంతగా పట్టించుకోను. తాజా విజయాలతో అభిమానులు నా నుంచి మరిన్ని గొప్ప ఫలి తాలు ఆశిస్తారు. అయితే ఒత్తిడికి తలొగ్గకుండా సహ జశైలిలో ఆడటమనేది నాపైనే ఆధారపడి ఉంటుంది.

అందరికీ అద్భుతంగా గడిచింది...
గత రెండు వారాలు భారత బ్యాడ్మింటన్‌కు అద్భుతంగా గడిచాయి. కేవలం నేనే కాదు సహచరులు ప్రణయ్, సాయిప్రణీత్‌ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చారు. ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో లీ చోంగ్‌ వీ, చెన్‌ లాంగ్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లను ప్రణయ్‌ ఓడించడం తొలిసారి జరిగింది. ప్రణయ్‌ విజయాలకు నేను అభినందిస్తున్నాను. అయితే అతను సెమీఫైనల్లో ఓడిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది.

గోపీచంద్‌ వల్లే...
రియో ఒలింపిక్స్‌ తర్వాత గాయపడ్డాను. చీలమండ గాయం నుంచి తేరుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. గాయం తగ్గిన తర్వాత ప్రధానంగా శిక్షణపైనే దృష్టి పెట్టాను. ఫిట్‌నెస్‌ సాధించాకే టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ నేను విజయాల బాట పట్టడానికి కోచ్‌ గోపీచంద్‌ కృషి ఎంతో ఉంది. భారత బ్యాడ్మింటన్‌ ఈ స్థాయికి రావడానికి గోపీచందే కారణం. ఒకవేళ ఆయన ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారకపోయుంటే మన క్రీడాకారులకు ఈ విజయాలు దక్కేవి కావు.

ఇంకా ఆస్వాదిస్తున్నాను...
ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయాలు ఇంకా ఆస్వాదిస్తున్నాను. ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హోను రెండుసార్లు ఓడించడం.. రియో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌పై నెగ్గడంతో నా ఫామ్‌పై నేనే ఆశ్చర్యపోయాను. నా విజయాలపై ప్రధాని మోదీ స్పందించి అభినందించడం నా బాధ్యతను మరింత పెంచింది. ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌), కేంద్ర క్రీడా శాఖలకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.

 భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతుండటం ఎంతో సంతోషాన్నిస్తోంది. అందులో నేనూ భాగంగా ఉండటం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. రాబోయే రోజుల్లో మేము మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. అంతర్జాతీయస్థాయిలో ఇంకా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇది అంతం కాదు. రాబోయే రెండేళ్ల కాలంలో భారత్‌ నుంచి టాప్‌–10లో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లు ఉంటారని ఆశిస్తున్నాను.’ 
 –హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

భారత ఆటగాళ్లు సాధిస్తున్న విజయాలతో ఎంతో సంతృప్తిగా ఉన్నాను. భవిష్యత్‌లో వీరందరూ తమ ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని ఇంకా గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. అయితే ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఇంకా సమయం ఉంది. ఆ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.
 –చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement