లాహోర్: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్‌లు తింటూ డైట్ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఒక అభిమానైతే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పిజ్జా-బర్గర్ తింటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ విమర్శించాడు. భారత్‌తో మ్యాచ్‌లోసర్పరాజ్ ఫీల్డ్‌లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనకు ఆహార నియమావళిలో సరైన నియంత్రణ లేకపోవడమేననే వాదన వినిపించింది.
కాగా, పాక్ క్రికెటర్లకు కొత్త కోచ్ మిస్బావుల్ హక్ సరికొత్త నియమావళిని ప్రవేశపెట్టాడట. ఫిట్‌నెస్ విషయంలో కొత్త సంప్రదాయానికి తెరలేపాలనే ఉద్దేశంతో ఇక నుంచి పాక్ క్రికెటర్లు బిర్యానీ, స్వీట్లకు దూరంగా ఉండాలనే నిబంధనను అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మ్యాచ్‌లు జరిగే సందర్భంలో కొవ్వును పెంచే బిర్యానీ, స్వీట్లు వంటి పదార్థాలు పాక్ క్రికెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనే నిబంధనను చేర్చాడట. దీన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా అవలంభించాలని చూస్తున్నట్లు ఒక పాక్ జర్నలిస్టు ట్వీట్ చేశాడు.
కొన్ని రోజుల క్రితం మికీ ఆర్థర్‌ను పాక్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. మిస్బావుల్‌కు ఆ బాధ్యతలు అప‍్పగించింది. మరొకవైపు దేశవాళీ మ్యాచ్‌లకు కోచ్‌లుగా వ్యవహరించే వారికి చీఫ్ సెలక్టర్‌గా కూడా మిస్బావుల్‌ను ఎంపిక చేశారు. దాంతో ఒకే సమయంలో రెండు కీలక బాధ్యతలు మిస్బావుల్ స్వీకరించాల్సి వచ్చింది. దానిలో భాగంగా తన మార్కును చాటడానికి యత్నిస్తున్న మిస్బావుల్ హక్.. ముందుగా ఆహార నియంత్రణలో కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment