కరాచీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ కావడంతో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముప్పు తెచ్చిపెట్టింది. దీనిపై వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. సర్ఫరాజ్‌ను టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా, చీఫ్ సెలక్టర్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో తొలుత సర్ఫరాజ్‌ను రెండు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒక కెప్టెన్‌గా పాకిస్తాన్ క్రికెటర్లను సరైన దారిలో పెట్టడంలో విఫలమవుతున్న సర్ఫరాజ్ వైఖరిపై మిస్బా గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో సర్ఫరాజ్‌ను సారథిగా తప్పించడమే మంచిదని భావించిన మిస్బా.. దాన్ని వెంటనే అమలు చేశాడు.
కేవలం వన్డేలకు మాత్రమే సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా పరిమితం చేసిన మిస్బా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీ20, టెస్టు ఫార్మాట్లకు వేర్వేరు సారథుల్ని నియమించింది. అజహర్ అలీని టెస్టు కెప్టెన్సీ అప్పచెప్పగా, బాబర్ అజామ్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. కాకపోతే వచ్చే ఏడాది జూలై వరకూ పాకిస్తాన్‌కు పెద్దగా వన్డే సిరీస్‌లు లేకపోవడంతో సర్ఫరాజ్‌ను నామమాత్రపు కెప్టెన్‌గానే ఉంచారు. 2016లో టీ20 కెప్టెన్‌గా నియమించబడ్డ సర్ఫరాజ్.. 2017లో వన్డే సారథిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్‌గా కూడా సర్ఫరాజ్ నియమించబడ్డాడు. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ‘జూనియర్ శ్రీలంక’ జట్టు చేతిలో వైట్‌వాష్ కావడంతో సర్ఫరాజ్ కెప్టెన్సీకి ప్రధానంగా ఎసరు తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment