మిస్బా మరో రికార్డు
క్రైస్ట్ చర్చ్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ టీమ్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ మరో రికార్డు సాధించాడు. పాకిస్థాన్ జట్టుకు ఎక్కువ టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత దక్కించుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అతడు ఆడుతున్నాడు. కెప్టెన్ గా ఈ మ్యాచ్ అతడికి 50వది. ఇమ్రాన్ ఖాన్ రికార్డు అతడు అధిగమించాడు. ఇమ్రాన్ ఖాన్ 48 టెస్టుల్లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఇప్పటివరకు 68 టెస్టులు ఆడిన మిస్బా ఉల్ హక్ 48.31 సగటుతో 4831 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలున్నాయి. ఉపఖండం జట్ల(భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్,) లో ఎక్కువ టెస్టు సిరీస్ విజయాలు అందించిన కెప్టెన్ గానూ మిస్బా ఖ్యాతికెక్కాడు. భారత దిగ్గజ కెప్టెన్లయిన సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించి అతడీ ఘనత అందుకున్నాడు.
గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలనుకున్న మిస్బా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అభ్యర్థన మేరకు మరికొంత కాలం కొనసాగేందుకు అంగీకరిచాడు. భవిష్యత్ లో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.