ఇస్లామాబాద్ : ‘నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. అందుకే జట్టు ఓడిపోయిందనుకుంటున్నా.. సరేనా ’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెచ్ కోచ్ మిస్బావుల్ హక్ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు లేనప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రీలంక యువ ఆటగాళ్లు పాక్‌ను వైట్‌వాష్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో మూడో మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి మిస్బా విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో నంబర్ 1గా ఉన్న జట్టుగా పేరు గాంచిన పాక్ ఇంతటి అపజయాన్ని మూటగట్టుకోవడానికి కారణం ఏంటని ఓ విలేకరి మిస్బాను ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా... ‘ అవును అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. కేవలం నేను మాత్రమే మారాను. నేనే ఏదో తప్పు చేసి ఉంటాను. కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌ను ఎడమ చేతివాటంతో ఆడమని చెప్పాను. అంతేకాదు రైట్ ఆర్మ్ బౌలర్లను.. లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేయమని చెప్పాను. అందుకే ఓడిపోయామని అనుకుంటున్నా. నేను అలా చేయకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.
అదే విధంగా లెగ్ స్పిన్నర్ షాబాద్ ఖాన్ ప్రదర్శనపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. దేశవాళీ జట్టులో మెరుగ్గా రాణిస్తున్న ఒక్క రిస్ట్ స్పిన్నర్‌ని అయినా జాతీయ జట్టులోకి తీసుకోకుండా ఉన్నామా అంటూ మిస్బా ఎదురు ప్రశ్నించాడు. ఇక తమ కోచ్ వ్యాఖ్యలను పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సమర్థించాడు. ‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే. ఇదే ఆటగాళ్లతో ఆడినప్పుడు మేం నంబర్ వన్ జట్టుగా ఉన్నాము. మాపై బోర్డు ఒత్తిడి ఉందనడం సరికాదు. స్వేచ్చగా ఆడేందుకు మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. టీం మేనేజ్‌మెంట్ కఠినంగా శ్రమిస్తోంది. అయితే మైదానంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఆటగాళ్లు విఫలమం అవుతున్నారు’ అని పేర్కొన్నాడు. కాగా పాక్ సిరీస్‌కు తమ ఆటగాళ్లను పంపడానికి శ్రీలంక వెనుకాడటంతో.. భారత్ బెదిరింపుల కారణంగానే శ్రీలంక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment