వీడ్కోలుపై మిస్బా త్వరలో నిర్ణయం!
కరాచీ:పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ తన క్రికెట్ కెరీర్పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే ముందే మిస్బా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుదామని మిస్బా భావించినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విన్నపం మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. అయితే మిస్బా తన క్రికెట్ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు పీసీబీ ఉన్నతాధికారి తెలిపారు. ఇంగ్లండ్ తో సిరీస్కు మిస్బా కెప్టెన్ గా వ్యవహరించనున్నా, ఆ పర్యటనకు బయల్దేరే ముందే తన వీడ్కోలు నిర్ణయాన్ని మిస్బా వెల్లడించే అవకాశం ఉందన్నారు.
గతేడాది ఏడాది ప్రపంచకప్లో ఆసీస్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం వన్డేలకు, టీ 20లకు మిస్బా గుడ్ బై చెప్పాడు. పాకిస్తాన్ విజయాల్లో అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా మిస్బా కీలక పాత్ర పోషించాడు. 2012, 2015 సంవత్సరాల్లో ఇంగ్లండ్ పై పాక్ గెలిచిన రెండు టెస్టు సిరీస్ లకు మిస్బానే కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఆ రెండు టెస్టు సిరీస్లు యూఏఈలో జరిగాయి. కాగా, త్వరలో ఇంగ్లండ్ లో ఆరంభం కానున్న టెస్టు సిరీస్ నుంచి మాత్రం 42 ఏళ్ల మిస్బాకు తీవ్రమైన సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది.