అమిత్ మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదా?
న్యూఢిల్లీ: ప్రత్యర్థి బౌలర్ అమిత్ మిశ్రాపై పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో ఈ లెగ్ స్పిన్నర్‌కు అదృష్టం కలిసిరాలేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి అమిత్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సొంతం చేసుకొని ఉండేవాడని, కానీ ఆ అవకాశం అతనికి రాలేదని చెప్పాడు.
మూడు ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్‌తోపాటు ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అయిన షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ ను తన స్పిన్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు అమిత్.
అతని పర్ఫార్మెన్స్‌పై మిల్లర్ మాట్లాడుతూ 'మిశ్రాకు అదృష్టం కలిసిరాలేదు. అతను ఐదు వికెట్లు లభించలేదు. అతను గ్రేట్ బౌలర్. నన్ను, మాక్స్‌వెల్ ను, మార్ష్‌ను ఔట్ చేసి.. గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు' అని చెప్పాడు. ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలోని బౌలింగ్ పిచ్‌పై మిల్లర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 'నిజానికి లో స్కోరింగ్‌తో గేమ్ గతి మారిపోయింది. మేం వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్ గమనాన్ని మార్చింది. పిచ్ బాగానే ఉంది' అని చెప్పాడు.