జార్ఖండ్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం
⇒టీమ్ బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం
⇒విజయ్ హజారే రెండో సెమీస్ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు బసచేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రమాదం సంభవించడంతో మ్యాచ్‌ను వాయిదా వేశారు. ద్వారకలోని ‘వెల్‌కమ్’ ఫైవ్ స్టార్ హోటల్‌లో జార్ఖండ్ జట్టుతో పాటు తమిళనాడు జట్టు ఆటగాళ్లు బస చేశారు. బెంగాల్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం ఆటగాళ్లు ఉదయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని పరిణామంతో జార్ఖండ్ జట్టు బిత్తరపోయింది.
సకాలంలో ఆటగాళ్లు, అధికారులను వేరే ప్రదేశానికి తరలించడంతో ప్రమాదం తప్పింది. కానీ వారికి సంబంధించిన వస్తువులతో పాటు స్పోర్ట్స్ కిట్స్ హోటల్‌లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేసి వేదికను పాలెం ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్ నుంచి ఫిరోజ్‌షా కోట్ల మైదానానికి మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా సోమవారం జరగనుంది. ‘మేము టిఫిన్ చేస్తున్న సమయంలో ఫైర్ అలారం మోగింది. అప్పటికే గదులన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. వెంటనే మేమంతా పరుగెత్తాం’ అని జార్ఖండ్ ఆటగాడు జగ్గీ తెలిపాడు. దాదాపు 30 అగ్నిమాపక యంత్రాలు 3 గంటల పాటు శ్రమించి మంటలని అదుపులోకి తెచ్చాయి.