భారత్‌కు దూకుడు నేర్పిస్తాడు!
కోహ్లిపై జాన్సన్ ప్రశంస
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ తొలి మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లి తన ఆటతో పాటు గొడవతో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా మిషెల్ జాన్సన్‌ను అతను మాటలతో ఎదుర్కొన్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మైదానంలో ఎలా స్పందించినా ఇప్పుడు స్వయంగా జాన్సన్‌కు కూడా కోహ్లి శైలి నచ్చినట్లుంది. ఇకపై అతని కెప్టెన్సీలో భారత జట్టు మరింత దూకుడుగా ఉండగలదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు.
‘సాధారణంగా భారత జట్టు దూకుడుగా ఆడదు. అయితే ఇప్పుడు కోహ్లి కెప్టెన్సీలో అది మారవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కోహ్లిని చూస్తున్న నాటినుంచి అతను ఎప్పుడూ ఇంతే దుడుకుగా వ్యవహరిస్తాడు. ఫీల్డింగ్ పెట్టడం మొదలు చాలా అంశాల్లో ధోనితో పోలిస్తే మీకు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఎక్కడా తగ్గడాన్ని ఇష్టపడడు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా కోహ్లి తీరులో మార్పు కనిపించదు’ అని జాన్సన్ వ్యాఖ్యానించాడు.
వేగం తగ్గించాను...
ఏడాది క్రితం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన జాన్సన్ ఈసారి మాత్రం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని బౌలింగ్ వేగం కూడా తగ్గింది. జట్టు అవసరాల కారణంగా సుదీర్ఘ స్పెల్‌లు వేయాల్సి రావడంతో ఇలా జరిగిందని జాన్సన్ చెప్పాడు. ‘చిన్న చిన్న స్పెల్‌లతో నేను ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాను. 150 కిలోమీటర్ల వేగాన్ని ఎక్కువ సేపు కొనసాగించడం అంత సులువు కాదు. అందుకే ఇప్పుడు వేగం తగ్గింది. అయితే సిడ్నీలోనైనా నా తరహాలో చెలరేగేందుకు చిన్న స్పెల్‌లు ఇమ్మని కెప్టెన్, కోచ్‌లను కోరతాను’ అని జాన్సన్ చెప్పాడు.