ఆసీస్‌... తేల్చుకుందాం రా! | Mithali Raj becomes first player to score 10 fifty-plus scores in ODIs | Sakshi
Sakshi News home page

ఆసీస్‌... తేల్చుకుందాం రా!

Published Sun, Jul 16 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

ఆసీస్‌... తేల్చుకుందాం రా!

ఆసీస్‌... తేల్చుకుందాం రా!

ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన భారత్‌
కివీస్‌పై అద్భుత విజయం
మిథాలీ రాజ్‌ సెంచరీ
రాణించిన వేద, రాజేశ్వరి  


కివీస్‌ను తేల్చేశారు. చావోరేవోకు దిగిన మ్యాచ్‌లో తేలిగ్గా ఓడించారు. గెలిస్తేనే నిలిచే మ్యాచ్‌లో మిథాలీ సేన న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండ్‌ దెబ్బతీసింది. మొదట విలువైన భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన భారత కెప్టెన్‌... తర్వాత బౌలింగ్‌లో రాజేశ్వరి గైక్వాడ్‌ను రంగంలోకి దించి ప్రత్యర్థి భరతం పట్టించింది. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైవిధ్యమైన బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేసింది. భారత్‌ను సగర్వంగా సెమీస్‌కు చేర్చింది.  

డెర్బీ: ఒత్తిడితో బరిలోకి దిగినా... ఓపెనర్లు విఫలమైనా... భారత్‌ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్‌ పోరులో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారీ విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అసాధారణ ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్‌ (123 బంతుల్లో 109; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కింది. వేద కృష్ణమూర్తి (45 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధ సెంచరీ సాధించింది. తర్వాత న్యూజిలాండ్‌ 25.3 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ (5/15) అద్భుతమైన స్పెల్‌కు కివీస్‌ కుదేలైంది. మిథాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

వేద వేగం... మిథాలీ వీరోచితం
టాస్‌ నెగ్గిన కివీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పూనమ్‌ రౌత్‌ (4), స్మృతి మంధన (13) విఫలమయ్యారు. అప్పుడు జట్టు స్కోరు 21/2. ఈ దశలో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జతయ్యింది. ఇద్దరు మొదట క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 2 వికెట్లకు 31 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత కూడా వికెట్లను కాపాడుకున్నా పరుగుల వేగాన్ని మాత్రం పెంచలేకపోయారు. కుదురుగా ఆడుతున్న మిథాలీ 28వ ఓవర్లో కొట్టిన ఫోర్‌తో ఆమె అర్ధసెంచరీ (71 బంతుల్లో), జట్టు 100 పరుగులు ఒకేసారి పూర్తయ్యాయి. మరోవైపు హర్మన్‌ప్రీత్‌ అర్ధశతకాన్ని 83 బంతుల్లో చేసింది.

ఇద్దరు మూడో వికెట్‌కు 132 పరుగులు జోడించాక జట్టు స్కోరు 153 పరుగుల వద్ద హర్మన్‌ప్రీత్‌ (90 బంతుల్లో 60; 7 ఫోర్లు) కాస్పెరెక్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత వచ్చిన దీప్తి శర్మ (0) డకౌట్‌ కాగా... మిథాలీతో జతకట్టిన వేద ధాటిగా ఆడింది. ఆమె మెరుపులతో కివీస్‌ బౌలింగ్‌ కకావికలమైంది. వీరిద్దరూ 12 ఓవర్లలోనే 100 పరుగులు జతచేశారు. వేద 47 ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి... 34 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసింది. మిథాలీ 116 బంతుల్లో సెంచరీని అధిగమించింది. వన్డేల్లో ఆమెకిది ఆరో సెంచరీ. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. కాస్పెరెక్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో మిథాలీ, వేద, శిఖాపాండే (0) ఔటయ్యారు. శనివారమే జరిగిన చివరి రౌండ్‌ ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 59 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాపై, ఇంగ్లండ్‌ 92 పరుగుల ఆధిక్యంతో విండీస్‌పై, శ్రీలంక 15 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై గెలిచాయి.  

‘టాప్‌’ ఇంగ్లండ్‌...
మొత్తం ఎనిమిది జట్ల మధ్య లీగ్‌ దశ పోటీలు ముగిశాక 12 పాయింట్లతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో ఇంగ్లండ్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కగా... ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. భారత్‌ 10 పాయింట్లతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఈనెల 18న జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌; 20న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడతాయి. 23న లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ జరుగుతుంది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి మంధన (బి) హన్నా రొవి 13; పూనమ్‌ రౌత్‌ (సి) కెటీ మార్టిన్‌ (బి) తహుహు 4; మిథాలీ రాజ్‌ (సి) శాటర్‌వైట్‌ (బి) కాస్పెరెక్‌ 109; హర్మన్‌ప్రీత్‌ (సి అండ్‌ బి) కాస్పెరెక్‌ 60; దీప్తిశర్మ (సి) ప్రిస్ట్‌ (బి హన్నా రొవి 0; వేద కృష్ణమూర్తి రనౌట్‌ 70; సుష్మ వర్మ నాటౌట్‌ 0; శిఖా పాండే (సి) శాటర్‌వైట్‌ (బి) కాస్పెరెక్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 265.
వికెట్ల పతనం: 1–10; 2–21, 3–153, 4–154, 5–262, 6–265, 7–265.

బౌలింగ్‌: లే కాస్పెరెక్‌ 10–3–45–3, తహుహు 10–1–49–1, హన్నా రొవి 10–3–30–2, సుజీ బేట్స్‌ 8–0–59–0, అమిలియా కెర్‌ 10–0–64–0, శాటర్‌వైట్‌ 2–0–15–0.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సుజీ బేట్స్‌ (సి) వేద (బి) శిఖా పాండే 1; ప్రిస్ట్‌ (సి అండ్‌ బి) జులన్‌ గోస్వామి 5; శాటర్‌వైట్‌ (స్టంప్డ్‌) సుష్మ (బి) రాజేశ్వరి 26; కెటీ మార్టిన్‌ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి శర్మ 12; సోఫీ డివైన్‌ (సి) దీప్తి శర్మ (బి) రాజేశ్వరి 7; పెర్కిన్స్‌ (బి) దీప్తి శర్మ 1; గ్రీన్‌ (సి) జులన్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 5; హన్నా రొవి (బి) రాజేశ్వరి 4; అమిలియా కెర్‌ నాటౌట్‌ 12; తహుహు (సి) జులన్‌ (బి) రాజేశ్వరి 5; కాస్పెరెక్‌ (బి) రాజేశ్వరి 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (25.3 ఓవర్లలో ఆలౌట్‌) 79.

వికెట్ల పతనం: 1–5, 2–7, 3–27, 4–51, 5–52, 6–57, 7–62, 8–62, 9–67, 10–79.
బౌలింగ్‌: జులన్‌ గోస్వామి 5–1–14–1, శిఖాపాండే 5–1–12–1, దీప్తి శర్మ 6–0–26–2, రాజేశ్వరి 7.3–1–15–5, పూనమ్‌ యాదవ్‌ 2–0–12–1.

కివీస్‌ (బి) రాజేశ్వరి 79
పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా 266 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ అనూహ్యంగా భారత స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ ఉచ్చులో చిక్కుకుంది. శిఖా పాండే వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌తో మొదలైన కివీస్‌ పతనం క్రమం తప్పకుండా 26 ఓవర్లదాకా సాగింది. ఓపెనర్లు సుజీ బేట్స్‌ (1), ప్రిస్ట్‌ (5) మాత్రమే పేసర్లు శిఖా, జులన్‌లకు తలవంచగా... ఇక మిగతా పనంతా స్పిన్నర్లదే! రాజేశ్వరి రంగప్రవేశంతో ఒక్కసారిగా మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గింది. శాటర్‌వైట్‌ చేసిన 26 పరుగులే కివీస్‌ ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరు కాగా, కెటీ మార్టిన్‌ (12), అమిలియా (12) రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీప్తి 2 వికెట్లు తీయగా, శిఖా, జులన్‌ గోస్వామి, పూనమ్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement